గ్రామ పంచాయతీలకు కేంద్ర ఇచ్చే నిధులు నేరుగా పంచాయతీలకు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించడం… కేసీఆర్కు అసలు నచ్చలేదు. ఇలా ఎలా ఇస్తారని ఆయన మండి పడుతున్నారు. దాదాపుగా మూడు వారాల పాటు ఫాం హౌస్కు పరిమితమైన ఆయన … ప్రగతి భవన్కు వచ్చి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై సమీక్ష చేశారు. ఈ సమీక్షలో ప్రధానంగా నిధుల సమస్యను అధికారులు వివరించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు పంచాయతీల ఖాతాల్లోకి వేస్తున్నారని ప్రభుత్వం తీసుకోవడానికి రావడం లేదని వారు చెప్పారు. దీంతో కేంద్రం తీరుపై కేసీఆర్ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు.
పంచాయతీరాజ్ వ్యవస్థలో మూడంచెల విధానం వచ్చిన తర్వాత పంచాయతీలపై కేంద్రం పెత్తనం చెలాయించలేదని గుర్తు చేశారు కేసీఆర్. ప్రస్తుతం పాలిస్తున్న కేంద్రం ప్రభుత్వం పల్లెలపై పెత్తనం సాధించేందుకు ప్రయత్నిస్తోందని.. నేరుగా కేంద్ర పథకాల నిధులు ఇస్తామనడం చిల్లర వ్యవహారంగా అభివర్ణించారు. జవహర్ రోజ్గార్ యోజన, ప్రధాని గ్రామసడక్ యోజన, నరేగా వంటి పథకాలను రాష్ట్రాల ద్వారా కాకుండా నేరుగా కేంద్రమే ఇవ్వడమంటేని ప్రశ్నించారు కేసీఆర్. రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు స్థానిక ప్రభుత్వాలకే తెలుస్తాయని ఆ నిధులు ఆ మేరకు ఖర్చు పెడతారని వాటిని వదిలేసి నేరుగా కేంద్రమే నిధులు ఇస్తామని చెప్పడం మంచి పద్దతి కాదన్నారు. రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ.. ఆర్థికంగా దెబ్బతీసే కేంద్రం విధానాలు ఉన్నాయని గతంలో కూడా ఆరోపించారు కేసీఆర్.
నిజానికి ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకే ఇస్తోంది. కానీ రాష్ట్రాలు మాత్రం అసలు పనులకు ఉపయోగించకుండా నిధులు మళ్లిస్తోంది. పంచాయతీ ల నుంచి అనేక రకాలుగా ఫిర్యాదులు రావడంతో చివరికి కేంద్రం.. నిధులను నేరుగా పంచాయతీలకే ఇవ్వాలని నిర్ణయించుకుంది. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎలాగూ నోరిప్పలేవు. అయితే నిధుల మళ్లింపునకు పాల్పడటంతో ఇతర రాష్ట్రాలూ ఏమీ అనలేకపోతున్నాయి.