జగన్ అక్రమాస్తుల కేసుల్లో నిందితుడు, వైసీపీ పెద్దలతో బంధుత్వాలు కలిగి ఉండి… ఫార్మా ఇండస్ట్రీలోనే అత్యంత తీవ్రమైన ఆరోపణలు ఉన్న హెటెరో చైర్మన్ బండి పార్థసారధిరెడ్డికి సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ తరపున రాజ్యసభ అవకాశం ఇచ్చారు. ఆయనతో పాటు వరంగల్‌కు చెందిన వద్దిరాజు రవిచంద్ర అలియాస్ గాయత్రి రవితో పాటు నమస్తే తెలంగాణ సీఎండీ దామోదర్ రావుకు అవకాశం కల్పించారు. ఈ ముగ్గురిలో దామోదర్ రావుకు రెండేళ్లు మాత్రమే పదవికాలం ఉండే స్థానానికి ఎంపిక చేశారు. పార్థసారధి రెడ్డి, వద్దిరాజు రవిచంద్రలకు ఆరేళ్ల పదవి కాలం ఉంటుంది.
పార్థసారధి రెడ్డి ఏపీ అధికార పార్టీ పెద్దలకు అత్యంత సన్నిహితులు. ఇటీవల కరోనా కాలంలో ఆయన మందుల్ని బ్లాక్‌లో అమ్మినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఇన్‌కంట్యాక్స్ అధికారులు దాడులు చేస్తే హైదరాబాద్‌లో పలు అపార్టుమెంట్లలో ఇనుప బీరువాల్లో నోట్ల కట్టలు కుక్కి పెట్టిన వ్యవహారం బట్టబయలు అయింది. దాదాపుగా నూటా యభై కోట్ల రూపాయలు బయటపడ్డాయి. ఆ కేసులు ఏమయ్యాయో కానీ… ఇటీవల యాదాద్రికి బంగారం విరాళాలు ఇవ్వాలని కేసీఆర్ పిలుపునివ్వగానే ఏకంగా ఐదుకేజీల బంగారాన్ని ఇచ్చారు.
ఇక వరంగల్ కాంగ్రెస్ నేతగా ఉండి… టీఆర్ఎస్లో చేరారు వద్దిరాజు రవిచంద్ర. గాయత్రిరవిగా ఆయనకు పేరు ఉంది. గ్రానైట్ వ్యాపారంలో విపరీతంగా సంపాదించారు. అనూహ్యగా ఆయనను రాజ్యసభ సభ్యునిగాఎంపిక చేశారు. ఇక నమస్తే తెలంగాణ ఎండీ దామోదర్ రావుకు రాజ్యసభ ఇవ్వాలని కేసీఆర్ చాలా కాలంగా చూస్తున్నారు. ఇప్పటికి సాధ్యమయింది.
తెలంగాణ నుంచి ఆర్.కృష్ణయ్యకు వైసీపీ తరపున రాజ్యసభ ఇచ్చినందుకు టీఆర్ఎస్ నుంచి బండి పార్థసారధిరెడ్డికి చాన్సిస్తారని రెండు రోజుల నుంచి విపరీతంగాప్రచారం జరిగింది. అది కేసీఆర్ నిర్ణయం ప్రకటనతో నిజమయిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. అయితే కేసీఆర్‌కు… ఆంధ్రా వాళ్లకు చాన్సిచ్చారన్న అభియోగం వచ్చే అవకాశంలేదు. ఎదుకంటే హెటెరో చైర్మన్ ఫ్యామిలీ ఖమ్మం జిల్లాకుచెందిన వారని చెబుతున్నారు.