ఎమ్మెల్యే అనే స్థాయికి వెళ్లిన తర్వాత.. ఒక రేంజి పనులకు వాళ్లు పాల్పడుతారని మనం అనుకోం. కాస్త హుందాగా ప్రవర్తిస్తారనే నమ్మకం మనకుంటుంది. కానీ ఆ ఎమ్మెల్యే మాత్రం ఇలాంటి స్థాయి, హోదా లాంటివేమీ పట్టించుకోలేదు. తనకు ఆలోచనరాగానే గేటు దూకేశారు. అయితే ఇదేమీ అడ్డగోలు పనులకు సంబంధించి గానీ..అధికార పార్టీకి చెందిన వారు అనుచితంగా ప్రవర్తిస్తున్నారని అనిపించగానే… పోలీసులు కూడా వారికి కొమ్ము కాస్తున్నారనే అనుమానం రాగానే.. ఎమ్మెల్యే గారు.. ఏకంగా గేటు దూకేసి అయినా సరే దాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు? అయితే తాను అనుకున్నది సాధించారా? లేదా?
వివరాల్లోకి వెళితే.. ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ల ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణల గడువు శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా ఖమ్మంలో కొంత గందరగోళం కూడా నెలకొంది. సహజంగానే ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి రెబెల్స్ బెడద ఎక్కువైంది. తెరాసకు చెందిన వారు ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు వేసేయడంతో, బలవంతంగా వారితో ఉపసంహరింపజేయాల్సి వచ్చింది. ఇందుకోసం తెరాస నాయకులు నానా పాట్లు పడ్డారు. ఖమ్మంలో ఈ రెబెల్స్ తాకిడి వారికి కాస్త ఎక్కువగానే ఉంది. ఆ నేపథ్యంలో ఉపసంహరణల గడువు ముగిసిన కాసేపు తర్వాత కూడా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, రెడ్యానాయక్‌లు కమిషనర్ గదిలోనే కూర్చుని అభ్యర్థుల్ని ఉపసంహరింపజేసే పనిలో పడ్డారు.
గడువు ముగిసన తర్వాత కూడా వారిని లోపలే ఉంచారంటూ.. కాంగ్రెస్ నాయకులు మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే పువ్వాడ అజయకుమార్ ఇద్దరూ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అయితే పోలీసులు గేటుకు తాళం వేసి వారిని లోపలకు అనుమతించలేదు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే అజయకుమార్ గేటు దూకి లోపలకు దూసుకెళ్లి కమిషనర్‌కు ఫిర్యాదుచేశారు. పరిస్థితి అక్కడ ఉద్రిక్తంగా మారిపోయింది. భట్టి విక్రమార్కను నియంత్రించిన పోలీసులు ఆ తర్వాత తలుపులకు తాళాలు తీసేశారు. అయితే ఎమ్మెల్యే పువ్వాడ అజయకుమార్ గేటు దూకి వెళ్లి గొడవకు దిగడం మాత్రం సంచలనం అయిపోయింది.
అసలే ఇటీవలి ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల్లో తండ్రిని పోటీకి దింపి, కాంగ్రెస్ మద్దతుతో సహా సకల శక్తులను మోహరించినప్పటికీ.. దారుణంగా ఓడిపోయి పరాభవం చెంది ఉన్న ఎమ్మెల్యే పువ్వాడ అజయకుమార్.. కార్పొరేషన్ ఎన్నికల్లో అయినా తన కరిష్మా చూపించుకోవాలని ఉబలాటపడుతున్నట్లుంది. వీటిని ఆయన ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నందునే గేటుదూకి వెళ్లడానికైనా సిద్ధపడిపోయారంటూ జనం అనుకుంటున్నారు.