ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ పూర్తిగా ప్రైవేటీకరణ జరుగుతోంది. ఇప్పటికే రాష్ట్ర క్యాడర్ కాని ఓ అధికారి నేతృత్వంలో మొత్తం నడుస్తోంది. ఆయనకు తోడు కన్సల్టెంట్లు అన్ని వ్యవహారాలను చక్కబెడుతున్నారు. తాజాగా ఆర్థిఖశాఖలో జాయింట్ సెక్రటరీ స్థాయిలో ప్రైవేటు వ్యక్తుల్ని నియమించనున్నారు. దీనికి సంబంధించి ఇంటర్యూలు కూడా పూర్తి చేశారు. నిజానికి జాయింట్ సెక్రటరీ అంటే.. ప్రభుత్వంలో చాలా కీలకం. ఆర్థిక వ్యవహారాలు మొత్తం వారి కనుసన్నల్లో నడవాలి. అందుకే అలాంటి పోస్టుల్లో ఇప్పటి వరకూ ఔట్ సోర్సింగ్ వారినీ కానీ.. కాంట్రాక్ట్ వారినీ కానీ నియమించలేదు.
కానీ ఇప్పుడు నేరుగా ప్రైవేటు ఉద్యోగులకు ఇంటర్యూలుకు నిర్వహించి ఎంపిక చేస్తున్నారు. దీంతో ఏపీలో జరుగుతున్న ఆర్థిక అవకతవకలకు మరింత స్కోప్ పెరుగుతుందన్న ఆందోళనలు వినిపిస్తున్నాయి. ఈ ప్రైవేటు ఉద్యోగులు అంతా ఎవరో కాదని… వైసీపీ నేతల కంపెనీల్లో ఫైనాన్స్ విభాగాల్లో కీలకంగా పని చేస్తున్న వారేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి వారికే ఇంటర్యూలు నిర్వహించారని అంటున్నారు. అయితే వారి పేర్లేమిటి… వారి నేపధ్యం ఏమిటి అన్నవి ఇంకా బయటకు రాలేదు. కానీ ఉద్యోగులు మాత్రం వారంతా ఓ మిషన్పై చేరుతున్నారన్న ఆందోళనలో ఉన్నారు.
ప్రైవేటుగా చేరే ఉద్యోగులు చేసే వ్యవహారాలు ఎలాంటివి అయినా ఆ తప్పుల బాధ్యతలు ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగులపై పడతాయి. చేయాల్సినదంతా చేసి వారి దోవన వారు వెళ్తారు. కానీ పరిణామాలను ఎదుర్కోవాల్సింది మాత్రం అక్కడే ఉండాల్సిన ఉద్యోగులే. ఉద్యోగ సంఘం నేతలు పూర్తిగా ప్రభుత్వ చెప్పు చేతల్లో ఉండటంతో గట్టిగా ప్రభుత్వానికి నిరసన తెలిపే పరిస్థితి కూడా కనిపించడం లేదు.