దర్శకుడు పరశురామ్ లో మంచి స్పార్క్ వుంది. రైటింగ్ టేబుల్ దగ్గర స్ట్రాంగ్ గా వుంటారు. సోలో, శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం.. చిత్రాలు పరశురాంలోని మంచి కథకుడికి అద్దం పట్టాయి. ఐతే వచ్చిన చిక్కేంటంటే స్టార్ హీరోలని డీల్ చేయడంలో పరశురామ్ తడబడుతున్నారు. రవితేజతో చేసిన ఆంజనేయులు, సారొచ్చారు… దెబ్బకొట్టాయి. ఈ రెండు సినిమాల పాయింట్లు బాగానే వుంటాయి. కానీ ఆ పాయింట్ లో రవితేజ లాంటి స్టార్ ని ఎలా సెట్ చేయాలన్న దగ్గరే సమస్య వచ్చింది. ఇప్పుడు సర్కారు వారి పాట లో కూడా ఇదే సమస్య. సర్కారు వారి పాట మంచి పాయింట్. సామాన్యుడు అప్పు తెస్తే భయపడి ఏదోలా తిరిగి కడతాడు. కానీ కొందరు ఎంత సులువుగా ఆర్ధిక నేరాలకు పాల్పడుతూ బ్యాంకులకు డబ్బులు ఎగ్గొడుతున్నారనే పాయింట్ ని కథగా చేశాడు. మహేష్ బాబు కి ఇదే పాయింట్ నచ్చి ఓకే చేసుంటారు.
ఐతే మహేష్ బాబు లాంటి స్టార్ తో ఈ పాయింట్ ని డీల్ చేయడంలో పరశురామ్ మాస్ స్టామినా సరిపోలేదు. పరశురామ్ బలం వినోదం. ఫస్ట్ అంతా అసలు పాయింట్ తో సంబంధం లేకుండా లవ్ ట్రాక్ తో నడిపేసి.. రెండోసగానికి వచ్చేసరికి పాయింట్ తగ్గ సీన్లు వేసుకోలేక కేవలం డైలాగులతో నడిపించేశాడు. ఎత్తుకున్న పాయింట్ కి సరైన న్యాయం చేయలేకపోయడనే సంగతి సినిమా చూసిన అందరికీ అర్ధమైయింది. సర్కారు వారి పాటతో పరశురామ్ మరోసారి మాస్ ఎలిమెంట్స్ ని డీల్ చేయడంలో యావరేజ్ మార్కుల దగ్గరే ఆగిపోయాడు. అయితే నాగ చైతన్యతో చేస్తున్న సినిమాకి మాత్రం మళ్ళీ తన ఓల్డ్ స్కూల్ కి వెళుతున్నాడు పరశురామ్. గీత గోవిందం టైపులు క్లాసీ, సాఫ్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా నాగచైతన్య సినిమా వుండబోతుందని తెలిసింది. అటు నాగ చైతన్య కూడా గీత గోవిందం లాంటి సాఫ్ట్ ఎంటర్టైన్మెంట్ కోసమే ఎదురుచూస్తున్నాడు. 14రీల్స్ నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.