ఎఫ్ 3సినిమాకి రేట్లు పెంచలేదు. పాత జీవో ప్రకారమే రేట్లు నిర్ణయించారు నిర్మాత దిల్ రాజు. పెద్ద సినిమాలన్నీ రేట్లు పెంచి సినిమాలు ఆడించాయి. కానీ ఎఫ్ 3లాంటి క్రేజీ మూవీ ని మాత్రం పాత రేట్లకే చూపిస్తున్నారు దిల్ రాజు. దీనికి గల కారణం చెప్పారు దిల్ రాజు. ”ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 లాంటి భారీ బడ్జెట్ సినిమాలకు రేట్లు పెంచి దానికి సరిపడా రికవరీ చేయడానికి ప్రయత్నాలు చేశాం. ఇందులో సక్సెస్ కూడా అయ్యాం. ఐతే ఇక్కడ ఓ ప్రమాదం గమనించాం. చాలా మంది ప్రేక్షకులు థియేటర్ కి దూరమౌతున్నారు. అలాగే రిపీట్ ఆడియన్స్ తగ్గిపోయారు. అప్పర్ క్లాస్ ఓకే కానీ మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ ఆడియన్స్ మాత్రం థియేటర్ రావడం తగ్గిపోయింది. టికెట్ల ధరలు వారికి అందుబాటులో లేకపోవడం దీనికి కారణం” అన్నారు
”ఎఫ్3 అందరి కోసం తీసిన సినిమా. అన్ని వర్గాల ప్రేక్షకులు, ఫ్యామిలీ కలిసొచ్చి చూడాల్సిన సినిమా. ధరలు అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో పాత ధరలకే టికెట్లు రేట్లని తగ్గించాం. చాలా మంది ప్రేక్షకులు ఓటీటీ కూడా అలవాటు పడిపోయారు. వాళ్ళని కూడా థియేటర్ కి రప్పించాలనే ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాం” అని చెప్పుకొచ్చారు దిల్ రాజు.