జగన్మోహన్ రెడ్డి ముందస్తుకు వెళ్లడం ఖాయమని అనుకుంటున్న చంద్రబాబు… పొత్తుల విషయంలో వైసీపీ చేస్తున్న తరహాలో సవాళ్లు చేయడం ప్రారంభించారు. దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయాలని.. పొత్తు లేనిదే గెలవలేరని వైసీపీ నేతలు చంద్రబాబును విమర్శిస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు అదే తరహాలో జగన్‌కు ఐదేళ్లూ పరిపాలించే దమ్ము లేదని అంటున్నారు. రాయలసీమ జిల్లాల్లో పర్యటిస్తున్న ఆయన కడప జిల్లాలో భారీగా ప్రజాదరణ లభించడంతో పొంగిపోయారు. జగన్ పాలనా తీరుపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉందని గుర్తించి.. మరింత ఘాటు విమర్శలు చేస్తున్నారు.
ఎంత ఆలస్యమైతే అంత వ్యతిరేకత పెరుగుతుందన్న ఉద్దేశంతో ముందస్తుకు వెళ్లేందుకు జగన్ సిద్దమవుతున్నారని వైఎస్ఆర్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు చంద్రబాబు వారి నిర్ణయంపై విమర్శలు చేస్తున్నారు. ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు క్లిష్టంగా మారడంతో ముందస్తుకు వెళ్లడమే బెటరని జగన్ అనుకుంటున్నారని చెబుతున్నారు. అందుకే ఎన్నికల తరహాలో పార్టీ కార్యక్రమాలను పెంచారు. దీంతో టీడీపీ అధినేత కూడా ముందస్తు ఖాయమని నమ్ముతున్నారు. ఈ క్రమంలో ఆయన ఐదేళ్లూ పరిపాలింటే సత్తా లేదని ప్రకటనలు చేయడం ఆసక్తి రేపుతోంది.
ముందస్తుపై గతంలోలా వైసీపీ నేతలు రూల్ అవుట్ చేయడం లేదు. ఎప్పుడు ఎన్నికలకు వెళ్లాలన్నది తమ ఇష్టమని చంద్రబాబు చెప్పేదేంటి అంటున్నారు. అయితే చంద్రబాబు మాత్రం ముందస్తు కన్ఫర్మ్ అని విమర్శలు చేస్తున్నారు. ఏపీలో ఈ ముందస్తు రాజకీయం మరింత జోరుగా సాగే అవకాశం కనిపిస్తోంది.