అటు జీఏడీలో రిపోర్ట్ చేయగానే ఇటు ప్రెస్ మీట్ పెట్టేశారు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు. తనపై లేనిపోని ఆరోపణలు చేసి .. మూడేళ్లనుంచి ఏం పీక్కున్నారని ఆయన సజ్జలను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు ప్రభుత్వం సస్పెన్షన్ ఎత్తివేయడంతో జీఏడీలో రిపోర్ట్ చేశారు. కానీ ఆయనకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. సస్పెన్షన్ ఎత్తివేత ఉత్తర్వుల్లో జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలిచ్చారు. ఆ మేరకు సెక్రటేరియట్‌కు వచ్చిన ఏబీవీ.. సీఎస్ ను కలిసి రిపోర్ట్ చేయాలనుకున్నారు.. కానీ ఆయన కలిసేందుకు ఆసక్తి చూపించలేదు.
కౌంటర్లో జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి వెళ్లమన్నారు. అలా వెళ్లిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు. సీఎస్ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో ఆయన పీఏ కు లెటర్ ఇచ్చానని.. తన మీద ఎలాంటి కేసులు నిరూపించలేకపోయారని ఆయన స్పష్టం చేశారు. మూడేళ్ళ నుంచి ఏం పీక్కున్నారు.. ఏమీ తేల్చలేకపోయారన్నారు. సజ్జల తనపై మీడియాలో బురద జల్లడం ఎంతవరకూ కరెక్ట్ అని ప్రశ్నించారు. తాను ఏమి చేసినా చట్టానికి లోబడే పని చేశాన్నారు. రెండేళ్ల సస్పెన్షన్ ను సర్వీస్ గా పరిగణించాలని సీఎస్ ను అడుగుదామనుకున్నానని.. రెండేళ్ల జీతం ఇవ్వకుంటే హైకోర్టుకు వెళ్తానని ప్రకటించారు.
సీఎస్ పదవీ కాలం ఆరునెలలు పొడిగించారు. నాకు మాత్రం రెండేళ్ల సర్వీస్ ఉంది.. పోస్టింగ్ ఇవ్వకపోతే ప్రజాధనం వృధా అవుతుందని ఏబీవీ వ్యాఖ్యానించారు. ఆయన సస్పెన్షన్ ఎత్తివేసినా పోస్టింగ్ ఇవ్వడం డౌట్ గానే ఉంది. ఇప్పుడు మీడియాతో మాట్లాడారని ఆయనకు మరోసారి నోటీసులు జారీ చేస్తారేమో చూడాలి.