ఏపీలో ధాన్యం రైతులు తీవ్ర దోపిడీకి గురవుతున్నారని తన వద్ద ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయని.. సీఐడీ విచారణ చేయించాలని వైసీపీ రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ సంచలన ఆరోపణలు చేశారు.కలెక్టర్‌ను కలిసి ఆధారాలు సమర్పించి సీఐడీ విచారణ కోరుతానని ప్రకటించిన బోస్ ఆ తర్వాత సైలెంటయ్యారు. పార్టీ హైకమాండ్ ఈ అంశంపై ఇక మాట్లాడవద్దని ఆదేశించడంతో ఆయన ఆగిపోయినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆయన అలా ఫోన్ ఆపేసుకుని సైలెంటయిన వెంటనే అమరావతిలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు .. పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు ప్రెస్ మీట్ పెట్టారు.
పిల్లి సుభాష్ మాట్లాడింది స్కాం గురించి కాదన్నారు. బోస్ ఈకేవైసీలో జరుగుతోన్న జాప్యం గురించి మాత్రమే మాట్లాడారని కవర్ చేశారు. ఎంపీ చెప్పినట్లుగా అవతవకలు జరిగే ఆస్కారమే లేదని తేల్చేశారు పౌర సరఫరాల శాఖ కమిషనర్ గిరిజా శంకర్. నాలుగు ఎకరాల్లో రెండు ఎకరాలు నమోదు చేసి.. మిగతా రెండు ఎకరాలు వేరే వాళ్ల పేర్ల మీద నమోదు చేసే చాన్స్ లేదన్నారు.
తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని ఎంపీ బోస్ చెప్పినప్పటికీ..అధికారులు మాత్రం అలా జరిగే చాన్స్ లేదన్నారు.
అసలు ఏం జరిగిందో బోస్ నుంచి వివరాలు తీసుకునేందుకు కూడా ప్రభుత్వం కానీ అధికారులు కానీ సిద్దపడలేదు. స్కాం అనగానే.. ఎక్కడ బయటకు వస్తుందో అని టెన్షన్ పడి.. ఎంపీ నోరు మూయించేందుకు ప్రయత్నించారు కానీ.. ఆ సాక్ష్యాలేవో తీసుకుని స్కాంను బయట పెట్టి రైతుల్ని ఆదుకుందామన్న ఆలోచన చేయలేదు. ఆ స్కామేదో తామే చేస్తున్నట్లుగా.. మంత్రి , అధికారులు కంగారు పడిపోయి మీడియా ముందుకు కవరింగ్ చేయడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. సొంత పార్టీ ఎంపీ చేసిన ఆరోపణపై విచారణ జరిపిస్తే ఏమవుతుందని సామాన్యులు కూడా భావిస్తున్నారు.