వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి యొక్క అక్రమాస్తుల కేసులను ఈడి కోర్టుకు బదిలీ చేయాలని ఈడీ అభ్యర్ధనను సిబిఐ కోర్టు తిరస్కరించింది. మాధవ రామచంద్రన్, టిఆర్ కన్నన్ మరియు ఎకె దండమూడి అనే ముగ్గురు పారిశ్రామిక వేత్తలు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డా. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం నుండి పొందిన ప్రయోజనాలకు ప్రతిగా క్విడ్ ప్రొ పద్దతిలో రూ.34 కోట్లు జగన్మోహన్ రెడ్డికి చెందిన జగతి పబ్లికేషన్స్ లో పెట్టుబడి పెట్టారని సీబీఐ ఒక కేసు నమోదు చేసింది. సిబిఐ కోర్టు ఆ కేసును విచారిస్తోంది. అదే సమయంలో ఈడి అధికారులు కూడా దానితో సహా జగన్ పై సీబీఐ నమోదు చేసిన అన్ని కేసులపై సమాంతరంగా విచారణ చేపట్టడానికి సిద్దం అయ్యారు.
దానిపై అభ్యంతరం తెలుపుతూ జగన్ తరపున న్యాయవాదులు హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. దానిపై హైకోర్టు స్పందిస్తూ ఆ కేసులను అన్నిటినీ ఈడికి బదిలీ చేసే విషయంపై సిబిఐ కోర్టుని తన అభిప్రాయం తెలుపవలసినదిగా కోరింది. అందుకోసం ఈడి కూడా సిబిఐ కోర్టులో ఒక పిటిషన్ వేసింది. దానిపై సిబిఐ కోర్టులో నిన్న ఈడి, సిబిఐ, జగన్ తరపున న్యాయవాదుల వాదనలు వినిపించారు. పి.ఎం.ఎల్. చట్టంలోని సెక్షన్:44 (1) (సి) ప్రకారం ఈ కేసును విచారించే అధికారం తమకే ఉంటుందని ఈడి న్యాయవాది వాదించగా, దానిని సిబిఐ న్యాయవాది వ్యతిరేకించారు. కేంద్రప్రభుత్వం ఈడికి ఆ అధికారాలు కల్పిస్తూ ప్రత్యేక ఆదేశాలు జారీ చేస్తే తప్ప సిబిఐ పరిధిలో ఉన్న ఆ కేసును ఈడికి అప్పగించడం సాధ్యం కాదని వాదించారు. జగన్ తరపున న్యాయవాది కూడా సిబిఐ కోర్టు విచారిస్తున్న కేసును ఈడికి బదిలీ చేయడం సరికాదని వాదించారు. ముగ్గురి వాదనలు విన్న తరువాత సిబిఐ న్యాయమూర్తి ఈడి పిటిషన్ని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. కనుక జగన్ అక్రమాస్తుల కేసులన్నీ ఇక ముందు కూడా సిబిఐ కోర్టే విచారిస్తుంది. దీనిపై ఈడి ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.