డ్రైవర్‌ను హత్య చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాబుపై చాలా తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఆయన అమాయకులైన గిరిజులను భయపెట్టి.. గుప్పిట్లో ఉంచుకోవడం ద్వారా రాజకీయ ప్రాబల్యం పెంచుకున్నారు. ఆయన గిరిజనుడు కాకపోయినప్పటికీ గిరిజన సర్టిఫికెట్ పుట్టించుకుని నేరుగా ఎస్టీ నియోజకర్గం నుంచి పోటీ చేయడానికి సిద్దపడిన నేత ఆయన. 2001లో తూర్పు కాపునని చెప్పుకుని కాంగ్రెస్ పార్టీ తరపున ఏజెన్సీ ప్రాంతమైన అడ్డతీగల నుంచి జడ్పీటీసీగా గెలిచారు. 2006లో జడ్పీటీసీ పదవి అయిపోయాక… ఎస్టి సర్టిఫికెట్ పుట్టించుకుని అడ్డతీగల మండల ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ సర్టిఫికెట్‌తోనే 2009లో కాంగ్రెస్ టిక్కెట్ ఇవ్వలేదని రెబల్‌గా రంపచోడవరం నుంచి నామినేషన్ వేశారు. కానీ ఆయన నామినేష్ తిరస్కరణకు గురయింది. ఆ తర్వాత వైసీపీలో చేరి.. 2014 రంపచోడవరం నుంచేనామినేషన్ వేశారు.
అయితే ఆయన ఎస్టీ కాదని నామినేషన్ తిరస్కరించారు. వెంటనే వంతల రాజేశ్వరి అనే మహిళతో నామినేషన్ వేయించారు. టీడీపీ అధికారంలోకి వచ్చినా గిరిజన నియోజకవర్గంలో వైసీపీ గెలిచింది. వంతల రాజేశ్వరి ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఆమె ను డమ్మీ చేసి..పూర్తిగా అనంతబాబే పాలన చేసేవారు. చివరికి ఎమ్మెల్యేకు వచ్చే జీతం కూడా ఆయనే తీసుకునేవాడు. చివరికి టీడీపీ నేతల సహకారంతో అనంతబాబు కబంధహస్తాల నుంచి వంతల రాజేశ్వరి బయటపడింది. అయితే వైసీపీ తరపున ఏజెన్సీ బాధ్యతలు మొత్తం ఆయనే చూసుకునేవారు. గిరిజనుల్ని ఎలా గుప్పిట్లో పెట్టుకోవాలి.. ఎలా భయపెట్టారో అనంతబాబుకు తెలిసినట్లుగా ఇతరులకు తెలియదు. ఆయన ఎమ్మెల్యే కాకపోయినా రంపచోడవరం.. తూర్పు ఏజెన్సీలో మొత్తం ఆయన చెప్పినట్లుగానే నడుస్తుంది. ప్రస్తుత ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మి కూడా డమ్మీనేనని చెబుతూ ఉంటారు. ఆమె బదులు అన్నీ పనులు అనంత ఉదయభాస్కరే చక్కబెడుతూ ఉంటారు. ఇటీవల ఆయనకు కాపు కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చారు.
అనంతబాబు ఏజెన్సీలో గిరిజులను భయ భ్రాంతాలకు గురి చేయడానికి చాలా ట్రిక్స్ ప్లే చేస్తూంటారు. ఆయనపై పలు ఆరోపణలు ఉన్నాయి. గంజాయి రవాణా వంటి చట్ట వ్యతిరేక వ్యవహారాల్లోనూ ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉంది. ఓ సారి అరకు ఎంపీగా ఉన్నప్పుడు కొత్తపల్లి గీతపై దాడికి ప్రయత్నించడంతో జైలుకు కూడా వెళ్లారు. ఇప్పుడు నేరుగా ఆయన తన డ్రైవర్‌నే హత్య చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తప్పుడు క్యాస్ట్ సర్టిఫికెట్లతో రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయన… హత్య ఆరోపణల వరకూ వచ్చారు. తర్వాత వైసీపీలో ఇంకా ఎంత ఎత్తుకు ఎదుగుతారో చెప్పలేమన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.