వాలంటీర్లు, వార్డు సచివాలయాలు లేకపోతే కరోనా సమయంలో ప్రజలు ఏమైపోయేవారో అన్నట్లుగా సీఎం జగన్ దావోస్లో ప్రసంగించారు. ఆర్థిక వేదిక సదస్సులో ఆరోగ్య అంశాలపై జరిగిన సదస్సులో ఏపీ తరపున ఆయన ప్రసంగించారు. ఈ సందర్బంగా కరోనాను ఏపీ ఎలా కరోనాని జయించిందో ఇంగ్లిష్లో చెప్పారు. అదంతా ఏపీ ప్రజలకు తెలిసిందే. ఎందుకంటే గతంలో ఇక్కడ చెప్పినవే అక్కడ చెప్పారు. వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి నలభై నాలుగు సార్లు సర్వే చేశారని.. గ్రామ, వార్డు సచివాలయాలు.. సిబ్బంది గొప్ప సేవలు అందించారని చెప్పుకొచ్చారు. నిజానికి ఏపీలో కరోనా పరిస్థితులపై ప్రభుత్వం ఏమీ చేయలేదని.. చనిపోయిన వాళ్లని లెక్కల్లో నుంచితీసేసి..బతుకి ఉన్న వారిని తామే కాపాడుకున్నామని చెప్పుకుంటోందన్న విమర్శలు గతంలోనే వచ్చాయి.
సెకండ్ వేవ్ సమయంలో తిరుపతిలోని ఆస్పత్రి ఆక్సీజన్ లేక పదుల సంఖ్యలో మరణాలు సంభవించడం.. అంతర్జాతీయంగా కలకలం రేపింది. ఇక కరోనా పరిస్థితులు ఉన్నప్పటికీ వైసీపీ రాజకీయ వ్యవహారాలు జోరుగా సాగాయి. ఆ సమయంలో మరణాలు విపరీతంగా సంభవించాయి. సాధారణం కన్నా అత్యధిక మరణాలు చోటు చేసుకున్నాయి. అయితే వాటిని రికార్డు చేయలేదు. పైగా కరోనా కారణంగా మరణించిన వారికి ఇవ్వాల్సిన పరిహారం కూడా ఇవ్వకుండా దారి మళ్లించిందనే ఆరోపణలను ప్రభుత్వం ఎదుర్కొంటోంది. అయినా … వాలంటీర్లు, గ్రామ వార్డు సచివాలయాల వల్లే తాము కరోనాపై గెలిచామని జగన్ చెప్పుకోవడం ఆశ్చర్య పరుస్తోంది .
అదే సమయంలో గత మూడేళ్లుగా అంటే జగన్ పదవి చేపట్టినప్పటి నుండి చెబుతూ వస్తున్న మెడికల్ కాలేజీలు.. ఆస్పత్రుల్లో నాడు, నేడు వంటి వాటిపైనా గొప్పగా చెప్పారు. మూడేళ్లలో పనులేమీ చేయలేకపోయినా… ఎప్పుడూ చెప్పుకునే విధంగా అక్కడ చెప్పుకున్నారు. సదస్సులో పాల్గొన్న కొంత మంది ప్రతినిధులు … వేసిన ప్రశ్నలకు జగన్మోహన్ రెడ్డి సమాధానాలు చెప్పలేక చిరునవ్వుతో సరిపెట్టారు.