ఎమ్మెల్సీ లాంటి వాళ్లు నేరుగా మర్డర్లు చేశామని అంగీకరిస్తే ఎలాగోలా బయటపడేద్దామని ఆలోచిస్తున్న ప్రభుత్వాలు… హంతకుడని తెలిసినా ఎమ్మెల్సీ గారు అంటూ ఎస్పీ స్థాయి వ్యక్తులే గౌరవిస్తూ.. వ్యవస్థను అపహాస్యం చేస్తున్న పరిస్థితుల్లో ఇలాంటి వార్త కాస్త విచిత్రమే. స్వయంగా తన కేబినెట్‌లోని మంత్రిని అరెస్ట్ చేయించారు పంజాబ్ సీఎం భగవంత్ మాన్. పంజాబ్ ఆప్ ప్రభుత్వంలో విజయ్ సింగ్లా ఆరోగ్య మంత్రి .
ఆయన వైద్య ఆరోగ్య శాఖలో ప్రతీ కాంట్రాక్ట్ విషయంలో తనకు ఒక్క శాతం లంచంగా ఇవ్వాలని అధికారులను డిమాండ్ చేస్తున్నట్లుగా తేలిందని భగవంత్ మాన్ ప్రకటించారు. స్పష్టమైన సాక్ష్యాధారాలతోనే ఆయనను పదవి నుంచి తొలగిస్తున్నట్లుగా ప్రకటించారు. అంతే కాదు ఆయనపై వెంటనే.. ఏసీబీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయించారు. రాష్ట్రంలో ఒక్క శాతం అవినీతి జరిగినా సహించేది లేదని ఆయన ప్రకటించారు.
ప్రజలు ఎన్నో అంచనాల మధ్య ఆమ్ఆద్మీ పార్టీకి అధికారం అప్పగించారని .. అవినీతిని పారదోలేందుకు కృషి చేస్తామని భగవంత్ మాన్ ప్రకటించారు. మంత్రిని అప్పటికప్పుడు పదవి నుంచి తొలగించి.. అరెస్ట్ చేయించడం రాజకీయవర్గాల్లోనూ సహజంగానే సంచలనమయింది. దేశంలోని ఏ ఇతర రాజకీయ పార్టీ కూడా ఇలాంటి ప్రయత్నం చేయలేదు. గతంలో తెలంగాణలో రాజయ్యను అవినీతి ఆరోపణలతో తొలగించారు కానీ కేసులు పెట్టడం అరెస్ట్ చేయడం వంటివి చేయలేదు .