టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇటీవలి కాలంలో కులం గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా రెడ్డి సామాజికవర్గాన్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు ఆయన అందర్నీ దువ్వుతున్నారు. మనమేంది.. మన చరిత్రేంది.. అంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని చారిత్రక అంశాలను కూడా చెబుతూ.. రెడ్డి పాలకులు లేకపోవడం వల్ల కష్టాలు వస్తున్నాయని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఇప్పుడు తెలంగాణలో విస్తృత చర్చ జరుగుతోంది. టీ పీసీసీ అధ్యక్షుడికి ఇంత కులపిచ్చ ఎందుకని కొంత మంది విమర్శిస్తూంటే… వ్యూహాత్మకంగా రెడ్డి సామాజికవర్గాన్ని పూర్తిగా కాంగ్రెస్‌కు అనుకూలంగా మార్చడమే కాకుండా… వెలమల పెత్తనం ఏమిటన్న అభిప్రాయం కల్పిస్తున్నారని మరికొందరు వాదిస్తున్నారు.
రాజకీయాల్లో కులం పాత్రను ఎవరూ కాదనలేరు. ప్రతి రాజకీయ పార్టీకి ఓటు బ్యాంక్‌గా కొన్ని కులాలు ఉంటున్నాయి. కాంగ్రెస్ పార్టీకి రెడ్లతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఓటు బ్యాంక్‌గా ఉన్నారు. అయితే తెలంగాణ ఉద్యమం కారణంగా రెడ్ల యువత కూడా టీఆర్ఎస్ వైపు మొగ్గింది. ఇప్పుడు మూలాలను బలపరుచుకునే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి సామాజికవర్గాలను తెరపైకి తెస్తున్నారు. సహజంగా వెలమ సామాజికవర్గం దొరలు. వారి తీరుపై ప్రజల్లో అసంతృప్తి ఉంటుంది. దీన్ని ఆసరాగా చేసుకుని రేవంత్ రెడ్డి రాజకీయం చేస్తున్నారు. ఓపెన్‌గా కులాల గురించి మాట్లాడుతున్నారు.
అన్ని బేరీజు వేసుకునే రేవంత్ ఇలా మాట్లాడుతున్నారని.. విమర్శలు వస్తాయని ఆయన తగ్గే రకం కాదని అంటున్నారు. మొత్తంగా రేవంత్ రెడ్డి… కుల సమీకరణాలు చేపట్టడానికి అంతర్గత ప్రయత్నాల కన్నా బహిరంగ ప్రయత్నాలే ఎక్కువ చేస్తున్నారు. బీజేపీ మతం పేరుతో దూసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. టీఆర్ఎస్కు తెలంగాణ వాదం ఎలాగూ ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సామాజిక కోణంతో రాజకీయం చేస్తున్నారు.