అనంతపురం జిల్లా తాడిపత్రి అంటే గుర్తుకు వచ్చేది జేసీ బ్రదర్స్. తమదైన దూకుడుతో వారు రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. నిజానికి వారి నేపధ్యం ఎలా ఉన్నా… సొంత ఊరిపై వారి మమకారం మాత్రం ఎనలేనిది. దేశంలోనే అత్యంత విజయవంతమైన మున్సిపాల్టీల్లో తాడిపత్రి ఒకటి. అన్ని పారామీటర్స్‌లోనూ మంచి జీవన ప్రమాణాలు అక్కడి ప్రజలకు ఉంటాయి. ఇదంతా జేసీ బ్రదర్స్ కృషి. ముఖ్యంగా జేసీ ప్రభాకర్ రెడ్డి పట్టుదల. అయితే అనూహ్యంగా గత ఎన్నికల్లో ఆయన కుమారుడు అక్కడ్నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. దీంతో తాడిపత్రి లో జేసీ పట్టు సడలింది. జేసీ కుటుంబానికి ఫ్యాక్షన్ కాలం నాటి శత్రువు అయిన పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు.
తాడిపత్రిలో జేసీ ఫ్యామిలీ హవాను తగ్గించడానికి అంది వచ్చిన అవకాశాన్ని పెద్దారెడ్డి తన అతి రాజకీయ ప్రవర్తనతో చెడగొట్టుకున్నారన్న వాదన వినిపిస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో ఎన్ని ప్రయత్నాలు చేసినా జేసీ ప్రభాకర్ రెడ్డే విజయం సాధించారు. చివరికి కౌన్సిలర్లను లాగలేకపోయారు. అంటే.. అసలు పట్టు సాధించలేకపోకపోయినట్లేనని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో పెద్దారెడ్డి వ్యవహారశైలి తాడిపత్రి పట్టణ ప్రజలను నిరాశకు గురి చేస్తోంది. ఏ పనులు చేయకపోగా.. చేస్తున్న పనులను అడ్డుకోవడం.. స్వప్రయోజనాలు.. కమిషన్ల కోసం అడ్డం పడటంతో ఇదేంది పెద్దారెడ్డి అనేవారి సంఖ్య ఎక్కువ అవుతోంది. పార్కులు.. ఇతర అంశాల్లోనూ ఆయన తీరు వివాదాస్పదమయింది.
ఓ సారి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో లేనప్పుడు ఆయన ఇంటికి కుర్చీ వేసుకుని కూర్చోవడం.. తన తండ్రి విగ్రహాన్ని తాడిపత్రి నడి రోడ్డులో పెట్టాలనుకోవడం… ప్రభుత్వ అధికారులపై రుబాబు చేయడం .. తాను చెప్పినట్లే అన్నీ చేయాలని పట్టుబట్టడం వంటి వ్యవహారాలతో పెద్దారెడ్డి ప్రజల్లో చులకన అయిపోయారు. ఆయనకు పెద్దగా చదువు, విషయ పరిజ్ఞానం లేకపోవడంతో కొంత మంది చెప్పిందే నిజమని నమ్మి చేయమని పురమాయిస్తూంటారని చెబుతూంటారు. అదే సమయంలో ఆయన వ్యక్తిగత అలవాట్లపైనా ప్రజల్లో చర్చ జరుగుతోంది.
గత ఎన్నికల్లో వేవ్ వచ్చి పెద్దారెడ్డి గెలిచారు కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్న వాదన ఎక్కువగా వినిపిస్తోంది. అధికార పార్టీ నేతలు కూడా.. ఇప్పుడు సైలెంట్ అవుతున్నారు. అధికారం మారితే ఊళ్లు వదిలి పారిపోవడం కన్నా.. ఇప్పుడు కాస్త మంచిగా ఉంటే మంచిదన్న నిర్ణయానికి వస్తున్నారు. అందుకే ప్రత్యక్షంగా కాకపోతే.. పరోక్షంగా అయినా జేసీ బ్రదర్స్‌తో పరిచయాలు పెంచుకునేందుకు ఎక్కువ మంది ప్రయత్నిస్తున్నారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి స్వగ్రామం శింగమనల నియోజకవర్గంలో ఉంటుంది. తాడిపత్రికి ఆయన స్థానికేతరుడు. ఇది కూడా ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. మొత్తంగా వేవ్‌లో వచ్చిన గెలుపుతో జేసీ బ్రదర్స్ ముద్ర తాడిపత్రి నుంచి తొలగించే చాన్స్ వచ్చినా.. పెద్దారెడ్డి నేలపాలు చేసుకున్నారన్న వాదన ఎక్కువగా వినిపిస్తోంది.