కోనసీమలో చిచ్చు పెట్టాడనికే వైసీపీ ప్రణాళికాబద్దంగా వ్యవహరించిందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఇలా గొడవలు జరగడం.. అలా తమపై విమర్శలపై వైసీపీ నేతలు విరుచుకుపడటంతో పవన్ కల్యాణ్ అసలు విషయాలను ప్రజల ముందు ఉంచారు. ఎంత పకడ్బందీగా వైసీపీ ప్రజల మధ్య చిచ్చు పెట్టిందో వివరించారు. అసలు అన్ని జిల్లాలతో పాటే కోనసీమకు అంబేద్కర్ పేరు ఎందుకు పెట్టలేదని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. అలా పెట్టి ఉంటే సమస్యే ఉండేది కాదన్నారు. నెల తర్వాత జీవో ఇచ్చి.. మళ్లీ దానిపై అభ్యంతరాలకు నెల రోజుల గడువు ఇచ్చారన్నారు. మిగతా జిల్లాలకు ఎందుకు ఇవ్వలేదని.. కోనసీమకు కొత్త విధానం ఎందుకని పవన్ ప్రశ్నించారు.
ఉద్యమాలు జరగాలని.. ఉద్రిక్తతలు చెలరేగాలని ఇలా చేసినట్లుగా ఉందని తెలుస్తోందన్నారు. మళ్లీ అభ్యంతరాలు ఇచ్చేందుకు ఒకే వ్యక్తి రావాలంటూ కండిషన్ పెట్టడాన్ని కూడా పవన్ ప్రశ్నించారు. భావోద్వేగాలను ప్రణాళిక ప్రకారం రెచ్చగొట్టారని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. కుల సమీకరణాల మీదే ఏపీలో రాజకీయాలు నడుస్తున్నాయని పవన్ కల్యాణ్ అన్నారు. కులాల మీదే వైసీపీ ఆట ఆడుతోందని.. కుల ఘర్షణలు రెచ్చగొడుతోందని మండిపడ్డారు. మంత్రి, ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేస్తూంటే.. యంత్రాంగం చేష్టలుడిగిపోయేలా చేశారని పవన్ ఆరోపించారు. వైసీపీ ఉద్దేశం అల్లర్లు కోరుతున్నట్లుగానే ఉందన్నారు.
కృష్ణా నది ఉన్న జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టారని… సముద్రం ఉన్న జిల్లాకు కృష్ణా అని పేరు పెట్టారన్నారు. మహనీయుడైన పొట్టి శ్రీరాములను ఒక్క జిల్లాకు పరిమితం చేశారని ఆరోపించారు. ఎవరైనా జిల్లాకుపేరు వద్దని వ్యతిరేకిస్తే ఆ వ్యక్తిని వ్యతిరేకించడం ఎందుకవుతుందని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఎమ్మెల్సీ చేసిన హత్యను పక్కదోవ పట్టించడానికే అల్లర్లను తెరపైకి తెచ్చారని.. ఈ సమయంలో అల్లర్లు జరగడానికి కారణం అదేనని పవన్ మండిపడ్డారు. వైసీపీ నేత నిందలు వేసేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అమలాపురం ప్రజలు సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. జిల్లాలుక జాతీయ స్థాయి నేతల పేర్లు పెట్టడాన్ని జనసేన సమర్థిస్తుందని పవన్ కల్యాణ్ ప్రకటించారు.