తెలుగు రాష్ట్రాల్లో జనసేనతో పాటు కేఏ పాల్ ప్రజాశాంతి, కోదండరాం తెలంగాణ జనసమితి వంటి పార్టీలకు ప్రజల్లో గుర్తింపు ఉంది కానీ.. ఇంకా ఎన్నికల సంఘం వద్ద గుర్తింపు తెచ్చుకోలేదు. చాలా మంది ఇతరులు.. సాదాసీదాగా పార్టీ పేరు నమోదు చేయించుకుని వదిలేస్తారు. ఇప్పుడు అలాంటివారితో కలిపి పవన్, పాల్, కోదండరాం పార్టీలపైనా చర్యలు తీసుకునేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధమవుతోంది. ఈ పార్టీలన్నీ నియమ నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్టు గుర్తించిన ఈసీ చర్యలు తప్పవని హెచ్చరించింది.
సాధారణంగా రాజకీయ పార్టీలన్నీ అవి సేకరించిన విరాళాల నివేదికను ఈసీకి అందించాల్సి ఉంటుంది. అలాగే పేర్ల మార్పిడి, ప్రధాన కార్యాలయం, ఆఫీస్ బేరర్లు, చిరునామాల వివరాలను ఈసీకి అందించాలి. గుర్తింపు పొందని పార్టీలన్నీ ఈ నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్టు ఈసీ పేర్కొంది. దేశంలో ఇలాంటి పార్టీలు 2,100కు పైగా ఉన్నట్టు తెలిపింది. వీటన్నింటిపై కచ్చితంగా చర్యలు ఉంటాయని ఈసీ ప్రకటించింది.
ఎలాంటి చర్యలు అన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఈసీ పేర్కొన్న పార్టీలో పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన, ప్రొఫెసర్ కోదండరాంకు చెందిన తెలంగాణ జన సమితి, కేఏ పాల్ సారథ్యంలోని ప్రజాశాంతి పార్టీలు కూడా ఉన్నాయి. సాధారణంగా ఈసీ చర్యలు అంటే.. ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం విధించడం వంటివి ఉంటాయి. ఇతర చర్యలేమీ ఉండవు. ఇప్పుడు ఈ పార్టీలపై ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించడం లాంటివి చేస్తే… రాజకీయ దుమారం రేగుతుంది. అయితే చిన్న చిన్న పొరపాట్లే కాబట్టి ఈసీ అంత కఠిన నిర్ణయం తీసుకోదని మరికొందరు వాదిస్తున్నారు.