కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెటులో ప్రవేశ పెట్టిన ఆర్థిక సర్వేలో భవిష్యత్తుపై భరోసా ఉంది. అనేక సవాళ్లు పొంచి ఉన్నాయి. ప్రభుత్వానికి హెచ్చరికలున్నాయి. ఊకదంపుడు ఉపన్యాసాల నిజస్వరూపాన్ని బట్టబయలు చేసే వాస్తవాలున్నాయి. అన్నింటికీ మించి, కంటికి కనిపించని ఓ వెలుగు రేఖ కూడా ఉంది. ప్రతి లాభమూ కంటికి కనిపించకపోవచ్చు. ఇది కూడా అలాంటిదే.
మోడీ ప్రభుత్వం చేపట్టిన ఎల్ ఇ డి బల్బుల ఉద్యమం దేశ గతినే మార్చే స్థాయిలో సత్ఫలితాలను ఇస్తోందని ఆర్థిక సర్వే తెలిపింది. ఈ కార్యక్రమం వల్ల దేశ వ్యాప్తంగా 21,500 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ తగ్గుతుంది. ఏటా 109 బిలియన్ యూనిట్లు ఆదా అవుతాయి. ఫలితంగా 45 వేల కోట్ల రూపాయలకు పైగా ఆదా అవుతుంది. దీనివల్ల పర్యావరణ పరిరక్షణ కూడా జరుగుతుంది. ఏటా 85 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించవచ్చు.
2019 నాటికి దేశ వ్యాప్తంగా ఇళ్లలో, వీధి దీపాల స్థానంలో ఎల్ ఇ డి బల్బులను అమర్చాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ఇళ్లలో 77 లక్షల సాధారణ బల్బుల స్థానంలో ఎల్ ఇ డి బల్బులు వెలగాలి. 3 కోట్ల వీధి దీపాల స్థానంలోనూ ఆధునిక ఎల్ ఇ డి బల్బులు వెలుగులు ప్రసరింపచేస్తాయి. ఇప్పటికే ఏపీ సహా కొన్ని రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున కొనసాగుతోంది. దీని ద్వారా ఆదా అయ్యే విద్యుత్తును ఇతర అవసరాలకు, ఇప్పటి వరకు కరెంటు వెలుగుకు నోచుకోని గ్రామాలకు సరఫరా చేసే అవకాశం ఉంటుంది.
ప్రభుత్వం అంటే ఉచిత తాయిలాలు ఇచ్చి, పరిపాలనలో అవినీతిని పట్టించుకోకపోవడం కాదు. ప్రజలకు, దేశానికి ఏది మంచో అదే చేయడం. అది ఓటు బ్యాంకు పథకమే కానవసరం లేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది అదే. తాయిలాల పేరుతో ఓట్ల వేట చేసే పథకం కాదిది. దేశానికి ఎంతో ఉఫయోపడే పథకం. విద్యుత్ తో పాటు చమురు ఆదాకు కూడా చర్యలు తీసుకుంటే మన దిగుమతుల భారం తగ్గుతుంది. లీటర్ చమురుతో ఐదారు కిలోమీటర్లు మాత్రమే తిరిగే లగ్జరీ కార్లపై భారీగా సుంకాన్ని వడ్డిస్తే దిగుమతుల భారాన్ని తగ్గించవచ్చు. కారును కొనేటప్పుడే దాని విలువలో 50 లేదా 25 శాతం మేర ప్రత్యేకమైన ఫ్యూయల్ సర్ చార్జి విధిస్తే అలాంటి కార్ల కొనుగోలు తగ్గుతుంది. ఒక వేళ్ల, దానివల్ల కలిగే ఇంధన దిగుమతి భారానికి అనుగుణంగా ముందే సుంకాన్ని వసూలు చేసినట్టు అవుతుంది. ఇలాంటి సాహసోపేతమైన చర్యలే ఈ దేశానికి అవసరమని కొందరు నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి వాటిపైనా కేంద్రం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.