” అవినీతి, అహంకారం ఆకాశానికి ఎగసిన ప్రతిసారీ దాన్ని నేలకి అణగతొక్కి, పాతి పెట్టడానికి ఒకడొస్తాడు… ఆకాశం నుంచి కాదు, నీ నుంచి నా నుంచి, జనం మధ్య నుంచి…” అని అప్పట్లో అనుకుంటే ఎవరూ నమ్మలేదు. చివరికి ఆయనొచ్చినా నమ్మలేదు. జనం ఎన్నికల్లో ఓట్లు వేసిన తర్వాతనే నమ్మడం ప్రారంభించారు. ఆ ఒక్కడే ఎన్టీఆర్.
ఆత్మగౌరవ నినాదంతో కాంగ్రెస్కు చెక్ !
1980ల్లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుండేది కాదు. ప్రత్యామ్నాయమే లేదు. దాంతో ఆ పార్టీది ఇష్టారాజ్యం అయిపోయింది. ప్రజల్ని పట్టించుకోరు. అవినీతి పెరిగిపోయింది. అంతకు మించి తెలుగు నేతలకు కనీస గౌరవమర్యాదలు కూడా దక్కేవి కాదు. ఇలాంటి పరిస్థితిని మార్చాలని సినిమా రంగంలో ఆకాశానికంత ఎదిగిన ఎన్టీఆర్ సంకల్పించారు. ఎన్నికలకు తొమ్మిది నెలల ముందు పార్టీ పెట్టారు. తాను సినిమా హీరోనని చూడటానికి ప్రభంజనంలా జనం వస్తున్నారని… గెలిపించేస్తారని ఆయన అనుకోలేదు. అసలు అలాంటి ఆలోచనే పెట్టుకోలేదు. తొమ్మిది నెలల పాటు విస్తృతంగా తిరిగారు. తాను ఏం చేస్తానో వివరించారు. ప్రజల అభిమానాన్ని పొందారు.
ఇందిరాగాంధీనే ఢీ కొట్టి విజయం !
అధికారం , అహంకారం కళ్లు నెత్తికెక్కిన నాటి కాంగ్రెస్ నేతలు ముఖానికి రంగు పూసుకున్న వాళ్లు ఏం చేస్తారులే అని లైట్ తీసుకున్నారు. కానీ ప్రజలు మాత్రం అలా అనుకోలేదు. చరిత్ర గతిని మార్చే నాయకుడ్ని తయారు చేస్తున్నామని వారు డిసైడయ్యారు. ఫలితంగా పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారం కైవసం చేసుకున్నారు. నిజానికి అప్పట్లో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం కోసం ఒక్క ఏపీలోనే కాదు.. దేశ ప్రజలంతా ఎదురు చూస్తున్నారు.కానీ ప్రజలందర్నీ ఎన్టీఆర్ లాగా ప్రత్యామ్నాయంగా చూపించే నాయకుడు కరవయ్యారు. ఒక్కొకకరిగా దిగ్గజాల్లాంటి నేతలు ఉన్నా… ఇందిరాగాంధీ ముందు సరితూగలేకపోయేవారు. వారంతా ఏపీలో ఎన్టీఆర్ సాధించిన విజయాన్ని చూసి అబ్బురపడ్డారు.
కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం ఉందని దేశానికి చాటి చెప్పిన ఎన్టీఆర్ !
తొలి విజయం తర్వాత ఎన్టీఆర్ తొలి మహానాడు నిర్వహించాలని నిర్ణయించి ఆహ్వానిస్తే…అప్పటి దేశంలో ఉన్న దిగ్గజాలంతా హాజరయ్యారు. ఎంజీ రామచంద్రన్, బాబు జగ్జీవన్ రావు, ఫరూఖ్ అబ్దుల్లా, హెచ్ఎస్ బహుగుణ, చండ్ర రాజేశ్వర్ రావు , ఎల్ కే అద్వానీ, అటల్ బిహార్ వాజ్ పేయ్, రామకృష్ణ హెగ్దే, అజిత్ సింగ్ , శరద్ పవార్, ఉన్నికృష్ణన్, ఎస్ఎస్ మిశ్రా, మేనకాగాంధీ కూడా హాజరయ్యారు. అప్పట్లో కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోరాడుతున్న అందరూ మహనాడు వేదిక మీదకు వచ్చారు. అంటే తొలి అడుగులోనే ఎన్టీఆర్ జాతీయ రాజకీయాల్లో తనదై న ముద్ర వేశారు. సంక్షేమ పథకాలు కానీ.. తెలుగువారికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చే విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ ఆయన రాజకీయాలు చాలా సూటిగా ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ నేతల అరాచకాలకు చెక్ పెట్టేందుకు ఆయన రాజకీయంగానే నిర్ణయాలు తీసుకునేవారు. పరిటాల రవి వంటి వారిని రాజకీయాల్లోకి ఆహ్వానించిన విధమే దానికి నిదర్శనం.
నాలుగు దశాబ్దాలైనా ఇప్పటికీ ఎన్టీఆర్ రాజకీయం ఓ తారక మంత్రం !
జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ను తట్టుకుని నిలబడగలని నిరూపించి నేత ఎన్టీఆర్. ఇందిరాగాంధీ కుట్రలు చేధించుకుని… నిలబడిన నేత. ప్రారంభమే సంచలనం.. అది ఎంత సంచలనం అంటే.. నలభై ఏళ్ల తర్వాత కూడా ప్రభావం చూపేంత. ఆ పథకాలే ఇప్పటికీ కొనసాగించేంత. ఏ పార్టీ అయినా ఆయనను గుర్తు చేసుకోకుండా ఉండలేనంత. సినిమాల్లో ఆయనో శిఖరం అయితే.. రాజకీయాల్లో ఎవరెస్ట్ అని చెప్పుకోక తప్పదు.