కేసీఆర్ ఇటీవలి కాలంలో సంచలనం గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు . రెండు మూడు నెలల్లో సంచలనం అంటే.. ఖచ్చితంగా ఆయన రాష్ట్రపతి ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే మాట్లాడుతున్నారని ఎవరికైనా అర్థమైపోతుంది. ఇప్పుడు ఆయన అన్నా హజారానే రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టి.. అందరి ఆమోదంతో ఆయనను గెలిపించి… బీజేపీకి షాక్ ఇవ్వాలని.. అదే పెద్ద సంచలనంగా నమోదు చేయాలని కేసీఆర్ ప్లాన్‌గా భావిస్తున్నారు. అందుకే దేశవ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు.
కేజ్రీవాల్‌తో .. దేవెగౌడతో అదే చర్చించారు. అఖిలేష్ యాదవ్‌తోనూ మాట్లాడారు. బీహార్ వెళ్లి ఎన్డీఏ మిత్రపక్షం.. అయిన జేడీయూ నేత .. సీఎం నితీష్ కుమార్‌తోనూ మాట్లాడాలనుకుంటున్నారు. అయితే అన్ని ప్రాంతీయ పార్టీలనూ ఈ కోణంలో ఏక తాటిపైకి తెచ్చినప్పటికీ కాంగ్రెస్ మద్దతు లేకుండా అన్నా హజారేకు కనీస మద్దతు లభించడం కూడా కష్టం. కాంగ్రెస్ మద్దతివ్వకుండా వేరే అభ్యర్థిని నిలబెడితే కూటమి పార్టీలు కూడా ఆ అభ్యర్థికే మద్దతిస్తాయి.
ఈ అంశంలో సంచలనం సృష్టించాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్‌తో కేసీఆర్ సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్ ను కనీసం దగ్గరకు కూడా రానిచ్చే పరిస్థితి లేదు. ఇటీవల తెలంగాణ పర్యటనలో రాహుల్ గాంధీ అదే సంకేతాలు ఇచ్చారు. కేసీఆర్‌తో ఎలాంటి సంబంధాలు పెట్టుకునే ప్రశ్నే లేదన్నారు. కేసీఆర్‌కు కూడా ఈ తరహా గందరగోళ పరిస్థితి ఉండటంతోనే ఆయన పర్యటనలు కూడా ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటున్నారన్న చర్చ టీఆర్ఎస్లో సాగుతోంది .