ఇప్పట్లో కోటంటే పెద్ద లెక్కే లేదు. ఒకట్రెండు హిట్లు కొట్టిన కుర్ర హీరోయిన్లే కోటికి పడగలెత్తేస్తున్నారు. బడా హీరోల పారితోషికం ఇప్పుడు 50 నుంచి 100 కోట్ల వైపు పరుగులు పెడుతోంది. ప్రభాస్ వంద కోట్ల హీరో అయిపోయాడు కూడా. అయితే.. అప్పట్లో కోటి అందుకున్న తొలి కథానాయకుడిగా ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారు. మేజర్ చంద్రకాంత్ చిత్రానికి గానూ ఎన్టీఆర్ కోటి రూపాయల పారితోషికం అందుకున్నారు. 1993లో విడుదలైన సినిమా అది. మోహన్ బాబు నిర్మాత. అప్పట్లో అదే రికార్డ్. ఆ తరవాత కొన్నాళ్లకు చిరంజీవి ఈ రికార్డుని బద్దలు కొట్టారు. అప్పటి నుంచీ హీరోల పారితోషికం సినిమా సినిమాకీ పెరుగుతూనే ఉంది.
`మనదేశం`తో తెరంగేట్రం చేసిన ఎన్టీఆర్.. ఆ సినిమాకిగానూ అందుకొన్న పారితోషికం 200 మాత్రమే. అప్పట్లో నటీనటులంతా కంపెనీ ఆర్టిస్టులే. అందుకే జీతాలు తప్ప పారితోషికం కూడా పెద్దగా ఉండేది కాదు. నటుడిగా బిజీ అయినప్పటికీ, పారితోషికం పెంచేవారు కాదు ఎన్టీఆర్. నిర్మాతలకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలన్న తపన ఆయనది. లక్ష రూపాయల పారితోషికం అందుకోవడానికి ఎన్టీఆర్కి పదేళ్లు పట్టింది. ఎన్టీఆర్ తక్కువ పారితోషికం తీసుకోవడం ఆతరంలోని మిగిలిన హీరోలకు మింగుడు పడేది కాదు. ఎందుకంటే… ఏ హీరోకైనా ఎన్టీఆర్ కంటే తక్కువ పారితోషికమే అందేది. `ఎన్టీఆరే అంత తక్కువ తీసుకుంటున్నప్పుడు మీకు ఎక్కువ పారితోషికం ఇవ్వడం సరికాదు..` అని నిర్మాతలు చెప్పేవారు. దాంతో.. ఎన్టీఆర్ పారితోషికం ఎప్పుడు పెంచుతారా? అని మిగిలిన హీరోలు ఎదురు చూసేవారు.