టాలీవుడ్లో అపజయం ఎరుగని దర్శకులు ఇద్దరే ఇద్దరు. ఒకరు రాజమౌళి. ఇంకొకరు… అనిల్ రావిపూడి. మొన్నటి వరకూ కొరటాల శివ కూడా ఇదే జాబితాలో ఉండేవారు. కానీ `ఆచార్య` ఆ ట్రాక్ రికార్డుని దెబ్బకొట్టింది. ఆ సినిమాతో కొరటాలకు ఫ్లాపు రుచి తెలిసింది.
అనిల్ రావిపూడిది కూడా నాన్ స్టాప్ సక్సెస్ ట్రాకే. పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు.. ఇలా వరుసగా సక్సెస్ కొట్టుకుంటూ వచ్చారు. ఇప్పుడు `ఎఫ్ 3`తో ఆ ట్రాకుని కాపాడుకోగలిగారు రావిపూడి. ఆయన బలం కామెడీనే. లాజిక్ లేకపోయినా.. కామెడీతో మ్యాజిక్ చేసే సత్తా.. రావిపూడికి ఉందన్న విషయం ఎఫ్ 3తో మరోసారి అర్థమైంది. ఈ సినిమాలో కథేం కొత్తగా లేదు. పాత్రలూ అవే. కానీ.. తన కామెడీ టైమింగ్తో నిలబెట్టేశారు.
ఏ హీరోకైనా, దర్శకుడికైనా హిట్ ట్రాక్ కాపాడుకోవడం కత్తిమీద సామే. యేడాదికి వంద సినిమాలు వస్తే… అందులో హిట్లు 20 మాత్రమే ఉంటాయి. దాన్ని బట్టి… హిట్ విలువ అర్థం చేసుకోవచ్చు. కరోనా తరవాత ఒకట్రెండు పెద్ద సినిమాలు మినహా…. టాలీవుడ్ కి ఊపు తీసుకొచ్చిన ఫలితాలేం లేవు. ఆ లోటుని ఎఫ్ 3 తీర్చింది. కథ విషయంలో నేల విడచి సాము చేయ్యక్కర్లేదని, హిట్ ఫార్ములాని నమ్ముకొంటే సరిపోతుందని, విజయం తనంతట తనే దరి చేరుతుందని నిరూపించింది.. ఎఫ్ 3. ఈ హిట్టుతో.. టాలీవుడ్ లో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోగలిగారు రావిపూడి.