ఆచార్య తరవాత చిరంజీవి లెక్కలు మారాయి. ఆయన కాసేపు… ఆగి, ఆలోచించడం మొదలెట్టారు. వరుసగా కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వడం వల్ల… తన కెరీర్‌కి ప్లస్ అవుతుందా? లేదా? అనేది లోతుగా విశ్లేషించుకుంటున్నారు. ఇప్పటికే సెట్స్‌పైకి వెళ్లిన సినిమాల స్క్రిప్టుల్ని మరోసారి రీ రైట్ చేసుకొంటున్నారు. ఈ క్రమంలోనే వెంకీ కుడుములకు ఓకే చెప్పిన ప్రాజెక్టు విషయంలో ఇప్పుడు చిరు పునరాలోచనలో పడినట్టు వార్తలొస్తున్నాయి. ఈ సినిమాని చిరు పక్కన పెట్టేశారని చెప్పుకుంటున్నారు.
అయితే… వెంకీ కుడుముల సన్నిహిత వర్గాలు మాత్రం ఈ వార్తల్ని ఖండిస్తున్నాయి. “చిరుతో సినిమా ఉంది. ఈ విషయంలో డౌటు లేదు. ప్రస్తుతం వెంకీ కుడుముల స్క్రిప్టుని తయారు చేసుకుంటున్నారు. చిరుకి వినిపించిన తరవాత.. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారన్న దానిబట్టి తదుపరి ప్రణాళిక ఉంటుంది. వెంకీతో పని చేయడానికి చిరు ఓకే చెప్పారు. అయితే.. ఇప్పటి వరకూ ఏ కథ అనేది నిర్ణయించలేదు. కథ చెప్పకుండానే, ఈ ప్రాజెక్టు ఆగిపోయిందనుకోవడం కరెక్ట్ కాదు..“ అని చెబుతున్నారు. చిరు ప్రస్తుతం… వేసవి విడిది కోసం విదేశాలకు వెళ్లారు. తిరిగొచ్చాకే ఈ ప్రాజెక్టుపై ఓ నిర్ణయానికి వస్తారు. అప్పటి వరకూ అయితే ఈ ప్రాజెక్ట్ ఉన్నట్టే.