ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు మొదలయ్యాయి.యేడాది పొడవునా.. ఎన్టీఆర్ ని స్మరించుకుంటూనే ఉంటారు. ఈరోజు ఏ పత్రిక చూసినా, ఎన్టీఆర్ నామ స్మరణే. నాయకుంతా `జై ఎన్టీఆర్` అంటూ ఆయన జ్ఞాపకాల్లోకి వెళ్లిపోతున్నారు. అంతా బాగానే ఉంది. కానీ… ఎన్టీఆర్ ని నిజంగానే మనం స్మరించుకుంటున్నారా? ఈ ప్రభుత్వాలు నిజంగా ఆయనకు ఇవ్వాల్సిన గౌరవమే ఇస్తున్నాయా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. అంతెందుకు ఆయన పేరు మీద స్థాపించిన ఎన్టీఆర్ జాతీయ అవార్డు గురించి పట్టించుకునేవారే లేరు. గత ఆరేళ్లుగా ఎన్టీఆర్ జాతీయ అవార్డు ప్రకటించనే లేదు.
1996 నుంచి ఎన్టీఆర్ పేరు మీద ఓ జాతీయ అవార్డు ఇవ్వడం ప్రారంభించింది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. తొలి అవార్డు అందుకొన్నది ఎన్టీఆర్కి అత్యంత ఆప్తుడు, సమకాలికుడు ఏఎన్నార్. అప్పటి నుంచీ 2017 వరకూ ప్రభుత్వాలు మారినా, ముఖ్యమంత్రులు మారినా.. ఈ సంప్రదాయం కొనసాగుతూనే ఉంది. దిలీప్ కుమార్, శివాజీ గణేశన్, లతా మంగేష్కర్, బాలు, శారద, హేమా మాలినీ, కమల్ హాసన్.. ఇలా పేరొందిన ప్రముఖులు అవార్డులు అందుకున్నారు. 2017లో ఈ పరంపరకు బ్రేక్ పడింది. అప్పటి నుంచీ.. ఈ అవార్డుని పట్టించుకొనే లేదు. అసలు ఈ అవార్డు ఉందన్న విషయం.. ప్రభుత్వం మర్చిపోయిందా? అనే అనుమానాలూ వస్తున్నాయి. అవార్డు ప్రకటించడం, ప్రదానం చేయడం ఎంత పని? నంది అవార్డులే గాలికొదిలేశారు. ఎన్టీఆర్ అవార్డు ఎవరు పట్టించుకుంటారు? దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని కేంద్ర ప్రభుత్వం ఎంత నిష్టగా, అందిస్తుందో, ఆ సంప్రదాయాన్ని ఎంత పటిష్టంగా పాటిస్తుందో.. ఏపీ ప్రభుత్వం కూడా ఎన్టీఆర్ అవార్డు విషయంలోనూ అదే పంథాని అనుసరిస్తే బాగుంటుంది. అదే ఆయనకు అందించే ఘనమైన నివాళి.