ముందస్తు ఎన్నికలు ప్రచారం జోరుగా సాగుతూండగానే ఏపీలో రాజకీయ పార్టీ ల కార్యకలాపాలు కూడా పెరుగుతున్నాయి. గత మూడేళ్లలో తిరుమల పర్యటనకు తప్ప ఎలాంటి పర్యటనలకూ రాని ప్రధాని మోదీ తొలి సారి జూలైలో ఏపీ పర్యటనకు రానున్నారు. భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను నిర్వహించనున్నారు. అందులో పాల్గొనేలా ప్రధాని షెడ్యూల్ ఖరారయింది. ప్రధాని ఇలాంటి వేడుకలకు వస్తున్నారంటే బహిరంగసభను ఉద్దేశించి ప్రసించడం కూడా ఖాయమే.
ప్రధాని పర్యటనలో ఏపీ రాజకీయాల్లో బీజేపీ పాత్రపై ఓ క్లారిటీ వస్తుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. వైసీపీ పనితీరును ఆయన తీవ్రంగా విమర్శిస్తే.. ఆ పార్టీకి స్నేహానికి గుడ్ బై చెప్పినట్లేనని అనుకోవచ్చు. వైసీపీ పనితీరుపై ప్రశంసలు కురిపించకపోయినా.. కనీసం సైలెంట్‌గా ఉన్నా.. లోపాయికారీగా జగన్‌తో బీజేపీ సంబంధాలు కొనసాగించడానికి సిద్ధపడినట్లుగా భావించవచ్చు. అదే సమయంలో పవన్ కల్యాణ్ విషయంలో ఎలా వ్యవహరిస్తారన్నది కూడా స్పష్టమయ్యే అవకాశం ఉంది.
ప్రధాని పర్యటనకు పవన్ కల్యాణ్‌ను కూడా ఆహ్వానించి సముచిత ప్రాధాన్యం ఇస్తే ఓట్లు చీలకూడదన్న పవన్ భావజాలంతో ఏకీభవించినట్లు అవుతుంది. అదేమీ కాకుండా అది రాజకీయ పర్యటన కాదని అందుకే ఆయనను పిలవడం లేదనే కారణాలు చెబితే మాత్రం… బీజేపీనే ఆయనను దూరం పెడుతుందని అనుకోవచ్చు. మొత్తంగా ప్రధాని మోదీ పర్యటనతో ఏపీలో రాజకీయ సమీకరణాలు ఓ రూపానికి వస్తాయన్న అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది.