అమరావతిని మళ్లీ పట్టాలెక్కించాలనుకుటున్న సీఆర్డీఏ అప్పుల కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. దీంతో సిఆర్‌డిఎకు ఉన్న సొంత ప్లాట్లను ఈ వేలం ద్వారా అమ్మకానికి పెట్టారు. తొలి విడతలో రూ.300 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. అయితే ప్లాట్ల ఇ-ఆక్షన్‌కు కూడా అంత స్పందన కనిపించడం లేదు. ఇద్దరు, ముగ్గురు మాత్రమే దరఖాస్తు చేసుకున్నట్లుగా సీఆర్డీఏ వర్గాలు చెబుతున్నాయి.
గుంటూరు జిల్లా మంగళగిరి నవులూరు దగ్గర అభివృద్ధి చేసిన మిగిలిన ప్లాట్లకు ఈ వేలం నిర్వహించాలని సీఆర్డీఏ నిర్ణయించింది. ఇక్కడ మొత్తం 285.17 ఎకరాల్లో 1,327 ప్లాట్లను అభివృద్ధి చేశారు..331 ప్లాట్లను లాట్లుగా విభజించి.. ఇందులో 29 ప్లాట్లను వేలం వేసేందుకు సిద్ధమైంది సీఆర్డీఏ. 1,000 చదరపు గజాల చొప్పున ఉన్న ఆరు ప్లాట్లకు, 200 చదరపు గజాల చొప్పున 23 ప్లాట్లు ఆన్లైన్లో వేలం నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం చదరపు గజానికి రూ.17,800గా ధర నిర్ణయించింది.
ఈ ప్లాట్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి ఉన్నవారు ఈ నెల 27 సాయంత్రం 5లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. మూడు వందల కోట్లు వస్తాయని ఆశలు పెట్టుకున్నా… ఈ ప్లాట్లు కొనడానికి ఇద్దరు ముగ్గురు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. అంటే… ఎవరూ కొనరని అర్థం అనుకోవచ్చు. ఈ ప్లాట్లకు అతి దగ్గరలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, అకాడమీ, ఎయిమ్స్ ఆస్పత్రితో పాటు మంగళగిరి రైల్వేస్టేషన్ కూడా ఉన్నాయి. అయినా వైసీపీ ప్రభుత్వంపై నమ్మకం లేక ఎవరూ ముందుకు రావడం లేదని భావిస్తున్నారు.