” రాజకీయ జన్మనిచ్చిన చంద్రబాబును.. ఆయన భార్యను అత్యంత దారుణంగా తిట్టిన విశ్వాసం లేని వ్యక్తి అని.. అయనను ఎవరైనా ఎలా నమ్ముతారు ..” వల్లభనేని వంశీపై వైసీపీ నేత దుట్టా రామచంద్రరావు చేస్తున్న ప్రచారం ఇది. గన్నవరంలో ఇది విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. నిజంగానే కదా… చంద్రబాబు చాన్స్ ఇవ్వకపోతే వంశీ ఎక్కడ ఉండేవారు..? సీనియర్ నేతను పక్కన పెట్టి మరీ చంద్రబాబు గన్నవరంలో చాన్సిచ్చారు కదా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. పార్టీ మారితే మారారు కానీ.. అంత దారుణంగా తిట్టడం ఏమిటన్నది కూడా ఇప్పుడు గన్నవరంలో చర్చకు పెట్టారు దుట్టా రామచంద్రరావు. ఎక్కడకు వెళ్లిన వంశీని ఓ విశ్వాస ఘాతకుడిగా చూస్తున్నారు జనం.
వైసీపీ నేతలు దీన్నే విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దీంతో వంశీకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఆయన అన్న మాటలు అందరికీ నోటెడ్. తర్వాత మీడియాను పిలిచి పేరు పేరునా క్షమామపణలు చెప్పినప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదు. అందుకే ఇప్పుడు మరోసారి తెలుగుదేశం పార్టీ గొప్ప పార్టీ అంటూ కవరింగ్‌లు ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ గొప్ప పార్టీ అని ఆపార్టీని తాను ఎప్పుడూ విమర్శించలేదని ఆయన కొత్త వాదన ప్రారంభించారు. అయితే లోకేష్ చేతుల్లోకి వెళ్లిన తర్వాత మారిన విధానాలను మాత్రమే ప్రశ్నించానని ఆయన చెప్పుకొస్తున్నారు.
ఎలా చూసినా వంశీ క్యారెక్టర్ దిగజారిపోయే కొద్దీ దిగజారిపోతోంది. పార్టీ మారడమే తప్పిదం అనుకుంటే.. మారిన తర్వాత హద్దుపొద్దూ లేకుండా దారుణంగా చంద్రబాబుపైనా.. టీడీపీపైనా.. ఎన్టీఆర్ కుమార్తెపైనా వ్యాఖ్యలు చేశారు. అతను అంత నీచమైన వ్యక్తి అని వైసీపీ నేతలు ప్రచారం చేస్తూండటంతో ఇప్పుడు మళ్లీటీడీపీని పొగడాల్సి వస్తోంది. వంశీ తీరు చూసి టీడీపీ, వైసీపీ నేతలు నవ్వుకుంటున్నారు. రాజకీయాల్లో ఎలా ఉండకూడదో వంశీని చూసి నేర్చుకోవాలంటున్నారు.