రెడ్ల సింహగర్జన సభలో మంత్రి మల్లారెడ్డిపై జరిగిన దాడి రాజకీయంగానూ కలకలం రేపుతోంది. ప్రభుత్వంపై ఆ సామాజికవర్గంలో ఉన్న అసహనానికి అది సూచిక అని కొంత మంది చెబుతూంటే.. మరికొంత మంది మాత్రం రేవంత్ రెడ్డే ఇదంతా నడిపించారని అంటున్నారు. కుల సమావేశంలో కేసీఆర్ ను అతిగా పొగడతంతో మల్లారెడ్డిపై దాడి జరిగింది. ఉదయం ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టిన మల్లారెడ్డి రెడ్డి కార్పొరేషన్ కోసమే అందరూ ఆవేశపడినట్లుగా కవర్ చేసే ప్రయత్నం చేశారు. ఈ కార్పొరేషన్ ను ఏర్పాటు చేస్తామని 2018లోనే కేసీఆర్ హామీ ఇచ్చారని.. త్వరలో ఏర్పాటు చేస్తారన్నారు.
ఈ అంశాన్నే తాను చెప్పాలనుకున్నామని.. తమ వినతిని సీఎం దృష్టికి తీసుకెళ్తామనుకునేలోపు దాడి చేశారని ఆయన చెబుతున్నారు. రేవంత్ రెడ్డి అమెరికాలో ఉండి ఇలా దాడి చేయించారని ఆయన ఆరోపించారు. అయితే రెడ్ల సింహాగర్జనలో ఒక్క మల్లారెడ్డి మాత్రమే కాదు .. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ రెడ్డి నేతలందరూ హాజరయ్యారు. అందరూ సామాజిక కోణంలోనే ప్రసంగించారు. ఎవరిపైనా హాజరైన వారిలో వ్యతిరేకత రాలేదు.కానీ మల్లారెడ్డి మరీ ఓవర్గా కేసీఆర్ ను పొగడటంతో ఆ సామాజికవర్గంలో కోపం వచ్చేసింది. అదే సమయంలో ప్రసంగం ఆపి.. కాసేపు అక్కడే ఉన్నా సరిపోయేది.
కానీ హడావుడిగా వెళ్లే ప్రయత్నం చేయడంతో కొంత మంది దాడికి ప్రయత్నం చేశారు. పారిపోతున్నారన్న ప్రచారం జరగడంతో మరింత మంది దాడి చేశారు. మల్లారెడ్డి రాజకీయాల విషయంలో ఇంకా తప్పటడుగులు వేస్తూనే ఉన్నారని టీఆర్ఎస్ వర్గాలు కూడా చెబుతున్నాయి. ఇప్పుడు మళ్లీ ప్రెస్ మీట్ రెట్టి రెడ్డి కార్పొరేషన్ కోసమే అన్నట్లుగా ఆయన మాట్లాడటంతో ఆయన సామాజికవర్గంలోనే మరింత వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఏర్పడింది.