ఐపీఎల్ లో కొత్త విజేత ఆవిర్భవించింది. అదే… గుజరాత్ టైటాన్స్. ఈ సీజన్లో తిరుగులేని ఆట తీరు ప్రదర్శిస్తూ.. ఫైనల్లోనూ అదే జోరు చూపించి కప్పు ఎగరేసుకుపోయింది. నిజానికి.. టోర్నీ ఆరంభంలో గుజరాత్ టైటాన్స్ పై ఎవ్వరికీ నమ్మకాల్లేవు. ఎప్పటిలానే ముంబై, చెన్నై జట్లను ఫేవరేట్లుగా పేర్కొన్నారు. కానీ.. కొలకొత్తాతో సహా… ముంబై, చెన్నై దారుణమైన ఆటతీరు ప్రదర్శించి ప్లే ఆఫ్ చేరకుండానే ఇంటికి వెళ్లిపోయాయి. అసలేమాత్రం అంచనాలు లేని గుజరాత్ టైటాన్స్ కప్పు గెలిచి – అందరినీ ఆశ్చర్యపరిచింది.
గుజరాత్ లో హార్థిక్ పాండ్యా, మిల్లర్, గిల్, మాథ్యూవైడ్ లాంటి మేటి ప్లేయర్లు ఉన్నారు. కానీ వాళ్లెవరు ఎప్పుడు ఆడతారో చెప్పలేని పరిస్థితి. రషిద్ ఖాన్, షమీ లాంటి మ్యాచ్ విన్నర్లున్నా.. ప్రతీసారీ వాళ్లపైనే ఆధారపడలేదు. కానీ.. వీళ్లంతా పరిస్థితులకు తగ్గట్టుగా రాణించడం గుజరాత్ కి వరంలా మారిపోయింది. ఈ సీజన్‌తో హార్థిక్ పాండ్యా కెప్టెన్‌గా అవతరించాడు. నిజానికి ఇంత పెద్ద టోర్నీలో కెప్టెన్ గా అరంగేట్రం చేయడం అంత మామూలు విషయం కాదు. మైదానంలో… తను చాలా కూల్ గా ఉంటూ, ఉన్న వరరులను సక్రమంగా వాడుకున్నాడు. సరైన సమయంలో.. వృధిమాన్ సాహాని జట్టులోకి తీసుకొని.. తెలివైన పని చేశాడు పాండ్యా. సాహా మెరుపు ఆరంభాలు.. జట్టు గెలుపుకి కారణమయ్యాయి. ఓడిపోవడం ఖాయం అనుకున్న కొన్ని మ్యాచ్‌లు మిల్లర్, రషిద్ ఖాన్ల మాయాజాలంతో గెలిచేసింది గుజరాత్. తివాటియా కూడా కీలకమైన సందర్భాల్లో చెలరేగిపోయి, గుజరాత్‌కు మరపురాని విజయాల్ని అందించాడు.
ఫైనల్లో.. గుజరాత్ చాలా కూల్‌గా కనిపించింది. టాస్ ఓడిపోయినా.. తన ప్రణాళికల్ని కచ్చితంగా అమలుపరిచింది. షమీ, రషీద్ మాత్రమే కాదు.. మిగిలిన బౌలర్లూ కట్టుదిట్టమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ వేశారు. హార్థిక్ కీలకమైన మూడు వికెట్లు తీసి, సిసలైన ఆల్‌రౌండర్ అనిపించుకున్నాడు. వికెట్ తీసినప్పుడు అతిగా సంబరాలు పోకుండా.. కూల్‌గా తమ పని తాము చేసుకుంటూ పోయారు. ఆరంభంలోనే రెండు కీలకమైన వికెట్లు కోల్పోయినా, ఎక్కడా తడబడకుండా గిల్ – హార్థిక్ల జోడి సమన్వయం పాటించి విలువైన భాగస్వామ్యం జోడించింది. చివర్లో మిల్లర్.. షినిషర్‌గా మిగిలిన కార్యక్రమం పూర్తి చేశాడు. ఫీల్డింగ్‌లోనూ కట్టుదిట్టంగా వ్యవహరించింది. ప్రతీ మ్యాచ్‌లోనూ 15 నుంచి 20 పరుగులు సేవ్ చేసింది. టోర్నీ అంతా.. ఇదే రకమైన ఆటతీరు ప్రదర్శించింది గుజరాత్. అందుకే గొప్ప గొప్ప స్టార్లు లేకపోయినా, సమష్టి కృషిని నమ్ముకొని, విజేతగా నిలిచింది. వెల్ డన్.. హార్థిక్ పాండ్యా అండ్ టీమ్!