మారుతి కథకు ప్రభాస్ ఓకే చెప్పడం, మారుతి స్క్రిప్టు పనుల్లో తలమునకలైపోయి ఉండడం తెలిసిన విషయాలే. ఈ చిత్రానికి డి.వి.వి.దానయ్య నిర్మాత. ఏప్రిల్ లో సినిమా ప్రారంభం అవుతుందనుకున్నారు. ఆ తరవాత మే.. అన్నారు. ఇప్పుడు ఈ సినిమా ముహూర్తం దసరాకి షిఫ్ట్ అయిపోయింది. దసరాకి ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఆ వెంటనే సెట్స్‌పైకి వెళ్లిపోతారు. ప్రభాస్ – మారుతితో చేయడానికి ఉత్సాహంగా ఉన్నా, ఇప్పుడు కాల్షీట్లు సర్దుబాటు చేసే పరిస్థితిలో లేడు. ప్రభాస్ చేతిలో చాలా సినిమాలున్నాయి. సలార్, ప్రాజెక్ట్ కె, ఆదిపురుష్.. వీటన్నింటికీ సమానంగా డేట్లు ఇచ్చుకుంటూ వెళ్లాలి. అయితే ప్రభాస్ ఇప్పుడు `సలార్`ని యుద్ధ ప్రాతిపదికపై పూర్తి చేయాలని భావిస్తున్నాడు. మిగిలిన సినిమాల్ని పక్కన పెట్టి ముందు `సలార్` సంగతి తేల్చేద్దామని ఫిక్సయ్యాడు. `కేజీఎఫ్ 2` సూపర్ డూపర్ హిట్టయిపోవడమే అందుకు కారణం. ఫామ్ లో ఉన్న దర్శకుడ్ని వెయిటింగ్లో పెట్టకూడదని ప్రభాస్ భావిస్తున్నాడు. పైగా `రాధే శ్యామ్`తో ప్రభాస్ అభిమానులు పూర్తిగా నిరాశకు లోనైపోయారు. వాళ్లలో ఉత్సాహం తీసుకురావాలంటే `సలార్` లాంటి మాస్ ప్రాజెక్టే కరెక్ట్. అందుకే `సలార్`ని పూర్తి చేసి, వీలైనంత త్వరగా విడుదల చేయాలన్నది ప్రభాస్ ప్లాన్. `సలార్` పూర్తయిన వెంటనే మారుతి సినిమానీ `ప్రాజెక్ట్ కె` చిత్రాలకు డేట్లు కేటాయిస్తాడు. మారుతి ఎలాగూ సూపర్ ఫాస్ట్ వేగంతో సినిమాని పూర్తి చేస్తాడు. ఈలోగా.. స్ర్కిప్టుని అన్ని రకాలుగా సిద్ధం చేసుకొనే వీలు కూడా దొరుకుతుంది.