పంజాబ్‌లో కొత్తగా ఏర్పడిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలో ఆరోగ్య మంత్రి విజయ్ సింగ్లా అవినీతికి పాల్పడ్డారని ఆధారాలు లభించడంతో ఆయనను పంజాబ్ సీఎం భగవంత్ మాన్ బర్తరఫ్ చేసి అరెస్ట్ చేయించారు. ఏసీబీ కేసులు నమోదు చేయించారు. ఇప్పుడు ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వంలోని మంత్రి మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని సత్యేందర్ జైన్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. కోల్‌కతాకు చెందిన ఓ కంపెనీకి సంబంధించిన హవాలా లావాదేవీలకు సంబంధించిన కేసులో సత్యేందర్ జైన్‌ను అరెస్ట్ చేసినట్టుగా ఈడీ అధికారులు ప్రకటించారు.
అయితే పంజాబ్‌లో మాదిరిగా ఇక్కడ తమ మంత్రి అరెస్ట్ ను ఆప్ సమర్థించడం లేదు. తీవ్రంగా ఖండిస్తోంది. రాజకీయ కుట్ర చేశారని ఆరోపిస్తోంది. సత్యేందర్ జైన్ హిమాచల్ ప్రదేశ్‌కు ఆప్ ఇంచార్జ్ గా ఉన్నారు. అక్కడ ఎన్నికల సన్నాహాల కోసం ఆయన హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లాల్సి ఉండగా అరెస్ట్ చేశారని ఇది రాజకీయ కుట్రేనని ఆప్ అంటోంది. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడుకుని .. తమ పార్టీ నేతలను వేధిస్తోందని అంటున్నారు.
సత్యేందర్ జైన్ హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లకుండానే ఈ కేసు పెట్టారని అంటోంది. అయితే ఈ ఆరోపణలను బీజేపీ పట్టించుకోవడం లేదు. ఈడీ దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టే అరెస్ట్ చేశారని అంటోంది. ఓ మంత్రిని చేయించిన ఆప్ నాయకత్వం.. ఇంకో మంత్రి అరెస్ట్ అయితే మాత్రం గగ్గోలు పెడుతోందని సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి రాజకీయాలు … కేసులతో ముడిపడిపోతున్నాయని కొంత మంది సెటైర్లు వేస్తున్నారు.