జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో గెలిచి ఎలాగైనా అసెంబ్లీకి వెళ్లాల్సి ఉంది. లేకపోతే ఆయన రాజకీయ భవిష్యత్ ప్రమాదంలో పడుతుంది. దాంతో ఆ పార్టీ నేతలు ఇప్పటికే అనువైన సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. బీమవారం, గాజువాకల్లో ఓడిపోయినందున మరోసారి అక్కడ పోటీ చేయడం శ్రేయస్కరం కాదన్న వాదనలో ఉన్నారు. అందుకే ఇప్పుడు తిరుపతిని తెరపైకి తెచ్చినట్లుగా తెలుస్తోంది. తిరుపతిలో జనసేనను అభిమానించే సామాజికవర్గం ఓట్లు ఎక్కువగానే ఉంటాయి. గతంలో చిరంజీవి కూడా అక్కడ గెలిచారు.
జనసేన పార్టీ పెద్దల నుంచి సంకేతాలు వచ్చాయేమో కానీ తిరుపతిలో జనసేన ద్వితీయ శ్రేణి నేతలు పెద్ద ఎత్తున పవన్ కల్యాణ్ తిరుపతి నుంచి పోటీ చేయాలనే వాదన ప్రారంభించారు. తిరుపతికి కొత్తగా ఓ కమిటీని నియమించారు. ఆ కమిటీ ప్రమాణస్వీకారం పేరుతో కాస్త హడావుడి చేసిన తిరుపతి నేతలు .. పవన్ కల్యాణ్ తిరుపతి నుంచిపోటీ చేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతానికి తిరుపతిలో అన్ని వ్యవహారాలను కిరణ్ రాయల్ చూసుకుంటున్నారు. ఆయన కూడా పవన్ వచ్చి పోటీ చేయాలని అంటున్నారు.
పవన్ ను తిరుపతి నుంచి పోటీ చేయాలని కార్యకర్తలు ఆహ్వానిస్తున్నారన్న భావన కల్పించడానికి జనసేన సోషల్ మీడియా అకౌంట్లలో కూడా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఆ డిమాండ్లు ఉన్న ట్వీట్లను రీ ట్వీట్ చేస్తున్నారు. ఈ ప్రకారం చూస్తే పవన్ కల్యాణ్ ఈ సారి తిరుపతిపై దృష్టి సారించవచ్చని చెబుతున్నారు. గత ఎన్నికల్లో కమ్యూనిస్టులతో పొత్తులు పెట్టుకున్నా ప్రయోజనం లేదు. ఈ సారి బీజేపీతో పొత్తు వల్ల ఆయనకు ఇంకా మైనార్టీ ఓట్లు మైనస్ అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా గెలిచే సీటును ఎంచుకోవడం పవన్‌కు కత్తి మీద సాములాగే మారనుంది.