తెలుగుదేశం పార్టీలో దివ్యవాణి వ్యవహారం కొద్ది సేపు కలకలం రేపింది. మహానాడులో తనకు అవమానం జరిగిందని.. తన శవంతో కూడా రాజకీయాలు చేసేవాళ్లేమో అని తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న వీడియో సర్క్యూలేట్ అయిన తర్వాత మంగళవారం ఉదయం.. టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లుగా ట్వీట్ చేశారు. కాసేపటికే ట్వీట్ డిలీట్ చేశారు. అయితే అదే ట్వీట్ స్క్రీన్ షాట్ ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. టీడీపీలో ఉన్న దుష్టశక్తుల కారణంగా తాను రాజీనామా చేస్తున్నట్లుగా చెప్పారు.
అయితే ఏమైందో తెలియదు కానీ.. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా తాను చేసిన ట్వీట్‌ను.. సోషల్ మీడియా పోస్టులను డిలీట్ చేశారు. పార్టీలో తనకు ఉన్న సమస్యలపై చంద్రబాబు, లోకేష్‌లతో మాట్లాడతానని కొంత మందికి చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. దివ్యవాణి నిర్ణయంపై పార్టీలో కొంత మంది ముఖ్యులు స్పందించి ఆమెతో మాట్లాడటంతోనే ఆమె నిర్ణయం వెనక్కి తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
మహానాడులోనూ దివ్యవాణి పాల్గొన్నారు. తొలి రోజు యాక్టివ్‌గానే ఉన్నారు. అయితే మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆమె అవమానం ఫీలయినట్లుగా తెలుస్తోంది. తాను దేవుని బిడ్డనని.. అవసరం అయితే వైఎస్ఆర్‌సీపీలో చేరుతానని కూడా చెప్పడంతో అంతా ఆ పార్టీతో మాట్లాడుకునే … వీడియోలు రిలీజ్ చేస్తున్నారని అనుకున్నారు. తన నిర్ణయంపై నిలబడకపోవడంతో దివ్యవాణి రాజకీయంగా నిర్ణయం తీసుకోవడంలో గందరగోళంలో ఉన్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.