కమల్ హాసన్ – శంకర్ కాంబోలో వచ్చిన `భారతీయుడు` సినిమాని ఎవరూ మర్చిపోలేరు. అవినీతిపై… శంకర్ తనదైన స్టైల్ లో సంధించిన అస్త్రం అది. ఆ తరవాత వీరిద్దరి కాంబోలో సినిమా రాలేదు. మరోసారి.. ఇద్దరూ కలిసి.. `భారతీయుడు 2` మొదలెట్టారు. అయితే ఏ క్షణంలో ఆ సినిమాని పట్టాలెక్కించారో గానీ, అప్పటి నుంచీ అన్నీ అవాంతరాలే. నిర్మాతలతో శంకర్ ని పొరపొచ్చాలు రావడంతో ఆ ప్రాజెక్టు అర్థాంతరంగా ఆగిపోయింది. నిర్మాతలకూ, దర్శకుడికీ కమల్ సయోధ్య కుదర్చాలని ప్రయత్నించారు. కానీ సాధ్యం కాలేదు. చివరికి ఈ ప్రాజెక్టుకి కమల్ హాసనే దర్శకత్వం వహిస్తారని చెప్పుకొన్నారు. అయితే వీటిపై తాజాగా కమల్ హాసన్ స్పందించారు.
తెలుగు 360తో కమల్ భారతీయుడు 2 గురించి పెదవి విప్పారు. ”ఈ సినిమాకి నేను దర్శకత్వం వహించడం లేదు. శంకరే.. టేకప్ చేస్తారు. అయితే ఆయన ప్రస్తుతం వేరే ప్రాజెక్టు (రామ్ చరణ్ సినిమా)తో బిజీగా ఉన్నారు. అది అవ్వగానే.. మా సినిమా మొదలవుతుంది. నా నుంచి విరివిగా సినిమాలు రావాలని అభిమానులు ఆశిస్తున్నారు. యేడాదికి రెండు మూడు సినిమాలు చేయాలని ఉంది. దర్శకత్వ బాధ్యత కూడా నెత్తిమీద పెట్టుకుంటే అది కుదరదు. అందుకే… ఆ బాధ్యత ఇతరులకు అప్పగిస్తున్నా” అని చెప్పుకొచ్చారు కమల్. సో.. ‘భారతీయుడు 2’ ఇంకా శంకర్ చేతుల్లోంచి జారిపోలేదన్నమాట. చరణ్ సినిమా అవ్వగానే.. భారతీయుడు 2 మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ యేడాదిలోనే భారతీయుడు 2 పూర్తి చేయాలన్నది కమల్ ఆలోచన.