‘విక్రమ్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి వెంకటేష్ అతిథిగా హాజరయ్యారు. సభలో ఎవరు మైకు పట్టుకొన్నా… కమల్ ని పొగడ్డమే పని అయిపోయింది. పొగడ్తలకు కమల్ అర్హుడు కూడా. ఈ సందర్భంగా.. దర్శకుడు హరీష్ శంకర్ స్పీచ్‌తో అదరగొట్టాడు. కమల్ పై తనకున్న ప్రేమని.. తన మాటల్లో వ్యక్తపరిచాడు. వెంకీ కూడా.. కమల్ ని ఆకాశానికి ఎత్తేశాడు. ”కొన్ని సినిమాల్లోని కీలకమైన సన్నివేశాలు చేసేటప్పుడు మైండ్ బ్లాంక్ అయిపోతే… కమల్ సినిమాలు చూసి, ఆయన ఎక్స్ప్రెషన్లు పట్టేవాడ్ని” అని ట్రేడ్ సీక్రెట్ కూడా బయటకు చెప్పేశాడు. ప్రయోగాల్లో కమల్ ని కొట్టేవాడే లేడని.. నితిన్ కూడా ఉత్సాహంగా మాట్లాడాడు.
ఈ సందర్భంగా కమల్ నితిన్‌కి ఓ సలహా ఇచ్చారు. ”నన్ను చూసి మీరేం నేర్చుకోండి.. వెంకీని చూసి నేర్చుకోండి. మీరు తప్పకుండా సూపర్ స్టార్ అవుతారు” అని వెంకీకి సలహా ఇచ్చాడు. ఎందుకంటే వెంకీ, నితిన్ ఇద్దరూ గోల్డెన్ స్పూన్లతో పుట్టినవాళ్లే. వెంకీ వెనుక రామానాయుడు లాంటి అండ ఉంది. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి కూడా నిర్మాతే. ”నేను కూడా వెంకీలా గోల్డెన్ స్పూన్ తో పుట్టి ఉంటే పాడైపోయేవాడ్ని. వెంకీలా కష్టపడి స్టార్ అయ్యేవాడ్ని కాదు. నితిన్ ఈ విషయంలో వెంకీని ఆదర్శంగా తీసుకోవాలి..” అని సలహా ఇచ్చారు. వెంకీకి కూడా కమల్ విలువైన సలహాలే ఇచ్చారు. కానీ ఇప్పుడు కాదు. ”చాలా ఏళ్ల క్రితం వెంకీ నన్ను కలుసుకోవడానికి గోవా వచ్చారు. ‘నేను సినిమాలు చేస్తున్నా… అందులో హిట్లూ ఉన్నాయి. కానీ.. మనసులో ఏదో అసంతృప్తి ఉంది..’ అన్నారు. అప్పుడు నాకు తోచిన సలహాలు నేను ఇచ్చా. ఆ తరవాత వెంకీ ప్రయాణమే మారిపోయింది” అని ఈ సందర్భంగా కమల్ గుర్తు చేసుకొన్నారు.
కమల్ – వెంకీ కలసి `ఈనాడు`లో నటించారు. అయితే.. ఇద్దరూ సరస్పరం ఎదురు పడిన సీన్ ఒక్కటే. అందుకే `కమల్ తో పూర్తి స్థాయి సినిమా చేయాలని వుంది“ అని తన మనసులోని కోరికను బయటపెట్టేశారు వెంకటేష్. కమల్ కూడా.. “మర్మయోగి సినిమాని వెంకటేష్ తో కలిసి చేద్దామనుకొన్నా. కానీ.. చివరి నిమిషంలో ఆగిపోయింది. కానీ ఆ సినిమా చేస్తే ఇద్దరి కెరీర్లో మర్చిపోలేని సినిమాగా మిగిలిపోయేద“ని గుర్తు చేసుకొన్నారు.