ధనిక రాష్ట్రం తెలంగాణను ఆర్థిక కష్టాలు చుట్టు ముట్టాయి. అమ్మో ఒకటో తారీఖు అని కిందా మీదా పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. జీతాలకు కూడా డబ్బులు సర్దలేని పరిస్థితి ఏర్పడింది. రెండు నెలలుగా పైసా అప్పు పుట్టనివ్వకపోవడంతో ఖర్చులన్నీ పేరుకుపోయాయి. ఇప్పుడు కూడా ఇంకా అప్పులకు అనుమతి రాలేదు. దీంతో తీవ్ర ఒత్తిడి ఏర్పడింది. ఈ పరిస్థితిని ఎలా అధిగమించాలా కేసీఆర్ మథనపడుతున్నారు కానీ దారి కనిపించడం లేదు.
ఏపీకి ఒక్క నెలలో తొమ్మిదిన్నర వేల కోట్లు అప్పు చేసుకునే అవకాశం దక్కింది కానీ.. తెలంగాణకు ఒక్క రూపాయి కూడా చాన్స్ ఇవ్వలేదు. నిన్నటికి నిన్న ఇచ్చిన జీఎస్టీ పరిహారంలోనూ ఏపీకి రూ. మూడున్నర వేల కోట్లు వస్తే.. తెలంగాణకు మూడు వందల కోట్లు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వానికి సొంతంగా వస్తున్న ఆదాయంతో తప్ప సరిగా చేయాల్సిన చెల్లింపులు అయిన జీతాలు, అప్పులకు వడ్డీలు, పెన్షన్లు ఇలాంటి వాటికి సర్దలేకపోతున్నారు.
ఈ నెలలో రైతు బంధు అమలు చేయాల్సి ఉంది. పల్లె ప్రగతి వంటి కార్యక్రమాలూ ఉన్నాయి. బిల్లుల కోసం సర్పంచ్లు ఒత్తిడి తెస్తన్నారు. కొంత మంది ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిస్తూండటం రాజకీయం అవుతోంది. రాజకీయ కారణాలతోనే కేంద్రం రాష్ట్రంపై ఆర్థిక యుద్ధం ప్రకటించిదని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఆర్థిక సమస్యలతో పథకాల అమలు నిలిచిపోతే ప్రజా వ్యతిరేకత పెరుగుతుంది. అందుకే టీఆర్ఎస్ నేతలూ కంగారు పడుతున్నారు. అయితే ఇందు కోసమే మళ్లీ కేంద్రంతో సఖ్యత పెంచుకోవడానికి మాత్రం సిద్ధంగా లేరని చెబుతున్నారు.