దావోస్ నుంచి రాగానే ఢిల్లీ వెళ్లి ప్రధానితో భేటీ కావాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నారు. ఎప్పుడెళ్లినా ఏం చర్చిస్తున్నారో ఎవరికీ చెప్పడం లేదు. ఎప్పుడూ విడుదల చేసే ఓ ప్రెస్ నోట్‌ను తేదీ మార్చి విడుదల చేస్తూంటారు. ఈ సారి పర్యటన తర్వాత కూడా కొత్త అంశాలేమైనా ఉంటే చేర్చి ప్రెస్ నోట్ విడుదల చేస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ టూర్ వెనుక అంతర్గత ఎజెండా ఏమిటన్నది మాత్రం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.
ప్రస్తుతం దేశంలో రాష్ట్రపతి ఎన్నికల హడావుడి నడుస్తోంది. అడగకపోయినా సరే రానున్న రాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ బీజేపీనిలబెట్టే అభ్యర్థికి సంపూర్ణ మద్దతు ప్రకటించేందుకు సీఎం జగన్ వెళ్తున్నారని భావిస్తున్నారు. గతంలో రాష్ట్రపతి ఎన్నికలు జరిగినప్పుడు కూడా జగన్ బీజేపీ అడగకపోయినా ప్రత్యేకంగా ప్రధాని అపాయింట్ మెంట్ తీసుకుని మరీ వెళ్లి తమ మద్దతు ప్రకటించారు. తాను అలా అడగకపోయినా మద్దతిచ్చిన విషయాన్ని ప్రధాని నివాసం ముందు మీడియాకు కూడా చెప్పారు. ఈ నెలలోనే రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉన్నందున వెళ్లి భేషరతు మద్దతు ప్రకటించి వస్తారని భావిస్తున్నారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకు పూర్తి మెజార్టీ లేదు. వైఎస్ఆర్‌సీపీ మద్దతు అత్యంత కీలకంగా భావిస్తున్నారు. వైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఇదే విషయాన్ని పలుమార్లు చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. నిజంగానే కీలకం..మరి జగన్ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏమైనా లిస్ట్ ప్రధానికి ఇస్తారో లేదో స్పష్టత లేదు. రాజకీయ ప్రయోజనాల విషయంలో మాత్రం ఆయన పరోక్షంగా తన కోరికలు వెల్లడించే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.