దేశ్ కీ నేత కేసీఆర్ ఉత్తరాది మీడియా పంట పండించారు. తెలంగాణ ఎనిమిదో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఖర్చుకు వెనుకాడకుండా ప్రతి ఒక్క ఉత్తరాది హిందీ, ఇంగ్లిష్ మీడియాకు ఫ్రంట్ పేజీ.. ఫుల్ పేజీ .. కలర్ యాడ్స్ ఇచ్చారు. ప్రముఖ పత్రికలు మాత్రమే కాదు.. నవభారత్ టైమ్స్ లాంటి హిందీ పత్రికలకు కూడా ఈ యాడ్స్ వెళ్లాయి. అన్నింటిలోనూ కేసీఆర్ ఫోటో హైలెట్ అయింది. అది కూడా ఏదో ఓ రాష్ట్రానికి పరిమితమయ్యే యాడ్స్ కాదు… అన్ని ఎడిషన్లకూ ఆ యాడ్ అంటుంది. అంటే దేశం మొత్తం ఆ పత్రిక ఎక్కడ ప్రింట్ చేసిన యాడ్ ఖాయమన్నమాట.
ఇంతా భారీ మొత్తంలో కార్పొరేట్ కంపెనీలు కూడా తమ కొత్త ఉత్పత్తిని లేదా.. కొత్త వ్యాపారాన్ని లాంచ్ చేసే సమయంలో ప్రమోట్ చేయవని ప్రకటనల రంగంలో ఉన్న వారు చెబుతూ ఉంటారు. కానీ కేసీఆర్ స్టైలే వేరు. ఆ పత్రిక యాడ్ రేట్స్ తక్కువేమీ ఉండవు. ఎలా చూసినా.. రూ. నలభై.. యాభై కోట్ల వరకూ ప్రకటన ఖర్చు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇవి పత్రికలు మాత్రమే .. ఇక ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో ప్రచారాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
తనను తాను దేశ్ కీ నేతగా పరిచయం చేసుకోవడానికి కేసీఆర్ దేశంలో మీడియాను పక్కాగా ఉపయోగించుకుంటున్నారు. అయితే అందు కోసం తెలంగాణ ప్రజల సొమ్మును ఉపయోగిస్తూండటమే విమర్శలకు కారణం అవుతోంది. ఎందుకంటే ఆ ప్రకటనలన్నీ తెలంగాణ ప్రభుత్వ ప్రకటనలే. కొసమెరుపేమిటంటే… తెలుగు పత్రికలకు ఇచ్చారు కానీ ఏపీ ఎడిషన్లకు మాత్రం ఇవ్వలేదు.