తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ప్రతీ ఏడాది ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తుంది. తెలంగాణ ఏర్పాటుకు సహకరించిన వారికి సన్మానం చేస్తుంది. గత ఏడాది వరకూ బీజేపీ నేతలకు ఈ సన్మానం అందేది. ఈ సారి రాజకీయం మారింది. అలాంటి చాన్స్ లేదు. అందుకే బీజేపీ నేతలు సొంతంగా ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించాలని ప్లాన్ చేశారు. పార్టీ పరంగా అయితే ప్రాథాన్యత ఉండదని.. నేరుగా కేంద్ర ప్రభుత్వ ఖాతాలోనే వేడుక నిర్వహిస్తున్నారు.
కిషన్ రెడ్డి చూసుకుంటున్న పర్యాటక, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగే అధికారిక తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ కల్చరల్ సెంటర్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. కిషన్ రెడ్డి అధ్యక్షత వహిస్తారు. తెలంగాణ సింగర్ హేమచంద్ర సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వనున్నారు. మంచి విందు కూడా ఏర్పాటు చేశారు.
అదే సమయంలో తెలంగాణ భవన్ ప్రాంగణంలో రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తోంది. తెలంగాణలో రాజకీయంగా సున్నితమైన పరిస్థఇతులు ఏర్పడ్డాయి. తెలంగాణ ఏర్పాటు విషయంపై ప్రధాని మోదీ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని టీఆర్ఎస్ నేతలు ఆగ్రహం చేశారు. నిరసనలు కూడా చేపట్టారు. ఈ క్రమంలో కేంద్రం ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహించడం ఆసక్తికరంగా మారింది. పోటీగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఎవరి వేడుకలు కళకళలాడతాయో వారికి మరింత హుషారొచ్చే అవకాశం ఉందనుకోవచ్చు.