వైసీపీ నుంచి మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడిని రాత్రికి రాత్రి బహిష్కరించడం కలకలం రేపుతోంది. అయితే ఈ విషయాన్ని సుబ్బారాయుడు సీరియస్‌గా తీసుకోలేదు కానీ కొన్ని ప్రశ్నలు మాత్రం పార్టీకి వేస్తున్నారు. అసలు తనపై ఎవరు ఫిర్యాదు చేశారు ? తన వివరణ కూడా అడగకుండా ఎలా సస్పెండ్ చేశారు ? చివరికి .. తన కంటే దారుణంగా పార్టీపై విమర్శలు చేస్తున్న ఎంపీ రఘురామకృష్ణరాజుపై ఎందుకు సస్పెన్షన్ వేటు వేయలేదు..? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆయన వైసీపీ నేతల్ని డిమాండ్ చేస్తున్నారు.
అయితే ఇలాంటి వాటిపై మాట్లాడేందుకు వైసీపీ నేతలు ఎప్పుడూ సిద్ధంగా ఉండరు. రఘురామకృష్ణరాజు రెబల్‌గా మారి చాలా కాలం అయింది. ఆయన రోజూ ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని విమర్శిస్తన్నారు. దమ్ముంటే సస్పెండ్ చేసుకోండి అని సవాల్ చేస్తున్నారు. సీఎం జగన్‌కు తనపై ఎంతో అభిమానం ఉందని అందుకే తనపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన అంటూ ఉంటారు. దానికి తగ్గట్లుగానే ఆయనపై చర్యలు తీసుకోవడం లేదు. అదే సమయంలో రఘురామ విమర్శల దాడి మాత్రం ఆపడం లేదు.
ఇప్పుడు కొత్తపల్లి లాంటి వాళ్లు పార్టీని ధిక్కరిస్తున్నారని వేటు వేస్తే.. వారు ఇదే అంశాన్ని లేవనెత్తుతున్నారు. రఘురామకన్నా తప్పు చేశానా అని ప్రశ్నిస్తున్నారు. ఇది వైసీపీ నేతలకు ఇబ్బందికరమైన ప్రశ్నలే. వారు సమాధానం చెప్పుకోలేరు.ఎందుకంటే సుబ్బారాయుడిపై వేటు వేస్తే వైసీపీకి పోయేలేదం లేదు..కానీ రఘురామపై వేటు వేస్తే ఆయనకు ఇంకా మేలు చేసినట్లుగా అవుతుంది.