తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేశారంటూ.. ఎమ్మెల్సీ స్టీఫెన్సన్ ఉదంతంలో కేసీఆర్ చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేస్తూ ఉంటారు. కానీ అసలు విషయం మాత్రం చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చాలని ప్రయత్నించింది కేసీఆరేనట. ఈ విషయాన్ని ఒకప్పుడు కేసీఆర్ ఆంతరంగిక మిత్రుడు.. మాజీ మంత్రి చంద్రశేఖర్ చెప్పారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న చంద్రశేఖర్.. ఆ పార్టీకి సంబంధించిన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు.
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు.. అరవై మంది ఎమ్మెల్యేలతో కేసీఆర్ టచ్లోకి వెళ్లినట్లుగా చంద్రశేఖర్ తెలిపారు. అయితే ఈ విషయాన్ని అప్పటి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన అప్రమత్తమయ్యారని… దీంతో కేసీఆర్ పాచికలు పారలేదని అంటున్నారు. ఈ అంశంపై ఇప్పటి వరకూ ఎలాంటి విషయాలు బయటకు రాలేదు.కానీ చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చాలని కేసీఆర్ ప్రయత్నం చేసిన విషయం మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.
కేసీఆర్కు మంత్రి పదవి ఇవ్వకపోవడంతో ఆయన పార్టీ పెట్టుకున్నారు. అంతకు ముందు ఆయన ఈ ప్రయత్నం చేసి ఉంటారని భావిస్తున్నారు. కేసీఆర్ రాజకీయ ఎత్తుగడలు చూసిన వాళ్లు దీన్ని కొట్టి పారేయలేమని చెబుతున్నారు. అదేసమయంలో చంద్రశేఖర్ మరికొన్ని విషయాలు కూడా చెప్పారు. దళిత ముఖ్యమంత్రి హామీ ఇస్తే ప్రజల్ని మోసం చేసినట్లేనని.. ఇవ్వొద్దని చెప్పామన్నారు. కానీ వినిపించకోలేదని.. చంద్రశేకర్ చెబుతున్నారు. మొత్తంగా కేసీఆర్ ఒకప్పటి సన్నిహితులు ముందు ముందు చాలా విషయాలు బయట పెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు.