తెలుగుదేశం పార్టీ రాజకీయంగా తన పని తాను చేసుకంటోంది. కానీ అదేదో టీడీపీ పొత్తు కోసం ప్రయత్నిస్తోందన్నట్లుగా జనసేన, బీజేపీ అదే పనిగా రచ్చ చేస్తున్నాయి. చంద్రబాబు గతంలో ప్రభుత్వంపై పోరాటానికి కలసి రావాలని అందర్నీ ఆహ్వానించారు. ఆ పోరాటం సంగతేమో కనీ..అందరూ పొత్తుల కోసం పిలిచారన్నట్లుగా పోటీపడి ప్రకటనలు చేస్తున్నారు.
పవన్ ఎందుకంత తొందర పడుతున్నారు ?
పవన్ కల్యాణ్ పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో ఓట్లు చీలనివ్వబోమని ప్రకటన చేశారు. దానిపై అధికార పార్టీలో రియాక్షన్ వచ్చింది. దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయాలని వాళ్లు సవాల్ చేశారు. దీంతో పవన్ కూడా.. వాళ్లకి ఓటమి భయం కల్పించానని అనుకున్నారు. అ టెంపోను కొనసాగించాల్సింది పోయి… అప్పుడే బీజేపీతో కలిస్తేనే పొత్తులు లేకపోతే లేవన్న సంకేతాలు ఇస్తున్నారు. పవన్ ఇచ్చిన మూడు ఆపర్షన్లలో జనసేన ఒంటరి పోటీ.. జనసేన , బీజేపీ పోటీ మూడో ఆప్షన్‌గా పాత కూటమి కలిసి పోటీ చేయడం ఉంది. అంతే కానీ… టీడీపీతో మాత్రమే జనసేన కలిసే అవకాశం లేదని చెబుతున్నారు. ఇలాంటి చర్చలు చేయడానికి ఇంకా చాలా సమయం ఉంది. అసలు బహిరంగం మాట్లాడేవి కూడా కాదు. కానీ పవన్ ఎందుకింత తొందరపడుతున్నారు ?
పొత్తులు లేకుండా చేసే ప్రయత్నంలో సక్సెస్ అవుతున్న బీజేపీ !
జాతీయ రాజకీయాల కారణమో.. ప్రాంతీయ రాజకీయాల ప్రతిఫలమో కానీ బీజేపీ … ఎలాగైనా రాష్ట్రంలో వ్యతిరేక ఓటు సమీకృతం కాకూడదని కోరుకుంటోంది. దానికి పవన్ కల్యాణ్ పాచికలా ఉపయోగపడుతున్నారు. బీజేపీతో కలిసి పోటీ చేస్తే.. ఆరేడు శాతం ఓట్లు చీలిపోతాయి. కానీ దాని వల్ల ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందుకే టీడీపీపై కనీసం నియోజకవర్గాల్లో వెయ్యి ఓట్లు కూడా తెచ్చుకోలేని నేతలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. వైసీపీ కోవర్టుగా పేరు తెచ్చుకున్న విష్మువర్ధన్ రెడ్డి వంటివారు చంద్రబాబు వయసు గురించి కూడా మాట్లాడుతున్నారు. ఇదంతా వ్యూహం ప్రకారమే చేసుకుంటున్నారు.
పొత్తులపై ఎలాంటి ప్రకటనలు చేయని టీడీపీ !
కలసి పోరాడటానికే పిలిచానని పొత్తుల గురించి కాదని చంద్రబాబు ఓ సారి క్లారిటీ ఇచ్చారు. అందరూ పొత్తుల కోసమే అన్నట్లుగా మాట్లాడుతూండటంతో తర్వాత ఆయన పూర్తిగా ఆ విషయం వదిలేశారు. మహానాడులోనూ మాట్లాడలేదు. దీంతో వన్ సైడ్ లవ్ అన్న ఆయన.. వార్ వన్ సైడ్ అంటున్నారని.. పవన్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎవరి స్పందనలు ఎలా ఉన్నా.. టీడీపీ మాత్రం.. పార్టీ పరంగా తాము చేయగలిగిన పని తాము చేసుకుంటున్నారు. పొత్తుల గురించి ఎన్నికల సమయంలో ఆలోచిద్దామనుకుంటున్నారు. తామేదో పొత్తుల కోసం ప్రత్నిస్తున్నామని అనుకుంటున్నారని.. రాష్ట్రం బాగుపడాలనుకుంటే టీడీపీకి ప్రజలు అధికారం ఇస్తారని.. లేకపోతే లేదని వారంటున్నారు. మొత్తానికి తమను టార్గెట్ చేసి రాజకీయం చేస్తున్నారని టీడీపీ నేతలు ఓ అంచనాకు వచ్చారు.