తెలంగాణలో 2023 ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తులు లేకుండా ఒంటరిగానే పోటీ చేయాలని దాదాపు అన్ని పార్టీలు నిర్ణయించాయి. తెలంగాణ ఏర్పడక ముందు తెలంగాణ సాధన లక్ష్యంతో వ్యూహాత్మకంగా పొత్తులు పెట్టుకున్న టీఆర్ఎస్.. రాష్ట్ర సాధన తర్వాత ఎవరితోనూ కలిసి నడవాలని అనుకోవడం లేదు. జరిగిన రెండు ఎన్నికల్లోనూ ఒంటరి పోరు చేసింది. ఇక ముందు కూడా పొత్తులు పెట్టుకునే ఆలోచన చేయడం లేదు.
తెలంగాణలో పొత్తుల కోసం అర్రులు చాచి చాలా సార్లు దెబ్బ తిన్న కాంగ్రెస్ పార్టీ ఈ సారి మాత్రం ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకుంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. చాలా కలసి వస్తుందని అనుకుంది. కానీ మైనస్ అయిందని ఫలితాలు తేల్చాయి. ఈ క్రమంలో ఈ సారి ఒంటరి పోటీకే కాంగ్రెస్ మొగ్గు చూపుతుంది. టీడీపీతో పెట్టుకోరు.. టీఆర్ఎస్ తో పెట్టుకునే చాన్సే లేదని స్వయంగా రాహుల్ గాంధీ తేల్చారు. కమ్యూనిస్టులు దగ్గరకు వస్తారో లేదో తెలియదు . ఈ క్రమంలో పొత్తుల గురించి ఆలోచించడం వేస్ట్ అని ఒంటరిపోటీకి సిద్ధమని కాంగ్రెస్ చెబుతోంది.
భారతీయ జనతా పార్టీకి గత అసెంబ్లీ ఎన్నికల్లో 100కుపైగా సీట్లలో డిపాజిట్ గల్లంతయింది. దీనికి కారణం పొత్తులు లేపోవడమే. టీడీపీతో పొత్తులున్నప్పుడు నాలుగైదు ఎమ్మెల్యే సీట్లు గెలిచేవారు. పొత్తు లేకపోవడంతో ఒక్క స్థానానికే పరిమితం కావాల్సి వచ్చింది. ఇప్పుడు టీడీపీ ఉనికి లేదు. ఆర్ఎస్ ప్రధాన శత్రువు అయింది. కమ్యూనిస్టులు దగ్గరకు రారు. జనసేన పార్టీ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే.. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీది కూడా ఒంటరి పోరాటమేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
నేరుగా పొత్తులుండకపోవచ్చు కానీ.. లోపాయికారీ పొత్తులు అయితే ఉండటం ఖాయమని చెప్పుకోవచ్చు. టీఆర్ఎస్ కోసం మజ్లిస్ సహకరిస్తుంది. ఎడెనిమిది చోట్ల తప్ప ఆ పార్టీపోటీకి రాదు. మిగిలిన చోటల్లా టీఆర్ఎస్కు మద్దతిచ్చేలా ఒప్పందం జరుగుతుంది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ కూడా లోపాయికారీగా ఎవరికో ఒకరికి సహకారం అందించాల్సిందే. కమ్యూనిస్టులు… షర్మిల పార్టీ.. కేఏ పాల్ పార్టీ ఇలా అన్ని పార్టీలు.. ఇతర ప్రధాన పార్టీలతో పొత్తులు పెట్టుకోవు కానీ.. అంతర్గత సహకారతో ఓట్లు చీల్చడమే… కలపడమో చేస్తాయి.