రవీంద్ర భారతి వంటి ఆడిటోరియాల్లో ఎంతో మంది నృత్య ప్రదర్శనల ఆరంగేట్రం చేస్తూంటారు. బాగా డబ్బున్న వాళ్లు పత్రికల్లో ప్రకటనలు ఇస్తూంటారు. తమ పలుకుబడితో కొద్దిగా కవరేజీ వచ్చేలా చేసుకుంటారు. అది కూడా సాంస్కృతిక వార్తలకు కేటాయించిన కొద్ది స్పేస్లో ఓ చిన్న ఫోటోతో వార్త వస్తుంది. లోకల్ లాంగ్వేజ్ పత్రికల్లో అయితే… ఆ భాష వాళ్లకే ప్రాధాన్యం దక్కుతుంది.
అయితే అసలు తెలుగుకు సంబంధం లేదని ఎక్కడో ముంబైలో జరిగిన అంబానీకి కాబోయే కోడలు రాధికా మర్చంట్ భరత నాట్య ఆరంగేట్రం చేశారు. ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. అంతే ఈనాడు పులకరించిపోయింది. పేజీలు తగ్గిపోయి.. చాలా వార్తలను వీలైనంత వరకూ కుదించి ఇస్తున్న సమయంలో.. ఈ వార్తకు మాత్రం పెద్ద పెద్ద ఫోటోలు వేసి అత్యధిక ప్రచారం కల్పించారు. భాషా ప్రావీణ్యాన్ని మొత్తం ప్రయోగించి పొగడ్తల వర్షం కురిపించారు.
ఈనాడులో ఇలాంటి వార్తలు ఎవరికైనా ఎబ్బెట్టుగానే ఉంటాయి. బహుశా.. ఈనాడు యాజమాన్యంలో రిలయన్స్ చేరిపోయిందేమోనని ఎక్కువ మందికి డౌట్ వస్తోంది. అది కూడా ఇంతా ఇంతా కాకుండా… తల్చుకుంటే పత్రికను లాగేసుకుంటుందా అన్నంతగా ఉందేమో అన్న డౌట్ ఇలాంటి ప్రాధాన్యతలు కల్పించినప్పుడు కలుగుతూ ఉంటుంది. ఏదైనా.. ఇటీవల రామోజీరావు కుటుంబంలో జరిగిన ఓ వేడుకకు ఇచ్చిన ప్రాథాన్యం.. ఇప్పుడు అంబానీకి కాబోయే కోడలు నృత్యం అంటూ ఇచ్చిన ప్రాధాన్యం చూస్తే.. కాలానికి అనుగుణంగా కాకుండా.. అవసరాలకు అనుగుణంగా ఈనాడు మారుతోందన్న అభిప్రాయం పాఠకులకు కలిగితే తప్పేమీ లేదు. అయితే ఇతర పత్రికలు ఎప్పుడో ఆ స్థాయిని దాటేశాయి. అందుకే వారిని ఎవరూ ప్రశ్నించారు. విలువలు పాటిస్తూ.. లైన్ దాటుతున్నందునే ఈనాడు లాంటి వాటికే ఇలాంటివి ఎదురవుతూ ఉంటాయి.