తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం టెక్కలి. ఆయనను ఓడించాలని వైసీపీ అధినేత జగన్ చాలా పట్టుదలగా ప్రయత్నించినా సాధ్యం కాలేదు. అయితే ఆయన చేసిన ప్రయత్నాలు చివరికి ఆ పార్టీని మరింత గడ్డు పరిస్థితుల్లోకి నెట్టేశాయి. ముగ్గురు నేతలు తామంటే తాము అని పోరాడుకుంటూ.. ఒకరిపై ఒకరు పైచేయి సాధించడానికి వైసీపీని రోడ్డున పడేస్తున్నారు. వీరిని ఎలా సమన్వయం చేయాలో తెలియక ఇప్పుడు వైసీపీ నేతలు తంటాలు పడుతున్నారు.
2014, 2019లో టెక్కలి నుంచి కింజరాపు అచ్చెన్నాయుడు విజయం సాధించారు. రెండు సార్లు ఆయనకు ఎనిమిదివేల మెజార్టీ వచ్చింది. ఓ సారి ఆయన ప్రత్యర్థి దువ్వాడ శ్రీనివాస్, మరో సారి పేరాడ తిలక్. మధ్యలో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి ఆ పార్టీలో చేరారు. ఈ ముగ్గురూ వచ్చే ఎన్నికల్లో తమకే చాన్స్ అని పోటీపడి ప్రచారం చేసుకుంటున్నారు. కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒకరిపై ఒకరికి పైచేయి కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు.
గత ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వనందుకు… దువ్వాడ శ్రీనివాస్‌కు సీఎం జగన్ ఎమ్మెల్సీ చాన్సిచ్చారు. చూడటానికి సినిమాల్లో విలన్ సత్యప్రకాష్లా కనిపించే దువ్వాడ ఇటీవలి కాలంలో ఆయనలాగే ప్రవర్తిస్తున్నారు. అచ్చెన్నాయుడుని.. తిడుతూ.. కొడతానని హెచ్చరిస్తూ తిరుగుతున్నారు. ఆయన తీరు చూసి జనం కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇదంతా అచ్చెన్నాయుడిపై వ్యక్తిగత ద్వేషం కాదని.. వచ్చే ఎన్నికల్లో అచ్చెన్నాయుడికి పోటీ తానేనని చెప్పుకోవడానికి ఆయన ప్రయత్నమని వైసీపీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
గత ఎన్నికల్లో పోటీ చేసిన పేరాడ తిలక్.. దువ్వాడలా దూకుడుగా లేరు కానీ ఆయనకు హైకమాండ్ ఆశీస్సులు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లోనూ తిలక్‌నే నిలబెట్టాలన్న ఉద్దేశంతోనే దువ్వాడకు ఎమ్మెల్సీ ఇచ్చారని తెలుస్తోంది. పేరాడ తిలక్‌కు ఓ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. మరో వైపు కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి పార్టీలో చేరినప్పటికీ తనకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై అసంతృప్తితో ఉన్నారు. గత ఎన్నికలకు ముందే పార్టీలో చేరారు. టిక్కెట్ ఇవ్వలేదు. ప్రభుత్వం వచ్చి మూడేళ్లయినా ఏ పదవీ ఇవ్వలేదు. టెక్కలి టిక్కెట్ ఇస్తారేమో అని చూస్తున్నా.. ఆ చాన్స్ కూడా లేదని చెబుతున్నారు.
ఈ ముగ్గురికి ఎవరి వర్గం వారికి ఉంది. ఎవరి సామాజికవర్గం వర్గం అండ వారికి ఉంది. అయితే ముగ్గురూ ఒకరితో ఒకరు కలిసి పోటీచేసే పరిస్థితి లేదు. ఈ కారణంగా అచ్చెన్నాయుడు చాలా సేఫ్ జోన్లో ఉన్నారు. ఆయనపై వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలతో ప్రజల్లో .. వారిపై మరోరకమైన భావం ఏర్పడుతోంది. ఈ పరిస్థితులన్నీ ఇలా ఉంటే.. ఈ ముగ్గురిలో ఒకరు పార్టీ నుంచి వెళ్లిపోతున్నారన్న ప్రచారం ఉద్ధృతంగా సాగుతోంది.