పులివెందులలో ఏపీ సీఎం జగన్ ఇంటిని సీబీఐ అధికారులు పరిశీలించారు. అక్కడ కొలతలు తీసుకున్నారు. సీఎం జగన్‌తో పాటు ఎంపీ అవినాష్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి నివాస ప్రాంతాలను కూడా సీబీఐ అధికారులు పరిశీలించారు. సర్వేయర్లతో కొలతలు తీయించారు. కొంత కాలంగా వైఎస్ వివాకా హత్య కేసులో సైలెంట్‌గా ఉన్న సీబీఐ అధికారులు హఠాత్తుగా విచారణ ప్రారంభించి… నేరుగా సీఎం జగన్ ఇంటిని పరిశీలించడం ఆసక్తికరంగా మారింది.
ఇప్పటి వరకూ ప్రత్యక్షంగా కానీ.. పరోక్షంగా కానీ కేసు పులివెందులలోని సీఎం జగన్ ఇంటి వైపు వెళ్లలేదు. వైఎస్ వివేకాతో పాటు వైఎస్ భాస్కర్ రెడ్డి.. అవినాష్ రెడ్డి.. మరికొందరి ఇళ్ల చుట్టూ తిరిగింది. కానీ అనూహ్యంగా జగన్ ఇంటినికూడా పరిశీలించి..కొలతలు తీసుకోవడం ఇప్పుడు కాక రేపే చాన్సులు కనిపిస్తున్నాయి. కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో అన్న టెన్షన్ కొంత మందిలో ప్రారంభమయింది. ఇటీవలి కాలంలో దర్యాప్తు జరుపుతున్న సీబీఐపై ఒత్తిడి తెచ్చేందుకు అనేకప్రయత్నాలు జరిగాయి.
సీబీఐ దర్యాప్తు అధికారితో పాటు అప్రూవర్‌గా మారిన దస్తగిరిపైనా కేసులు పెట్టారు. ఈ పరిణామాలతో.. సీబీఐ మరింత దూకుడు పెంచింది. సీఎం జగన్ ఇంటి పరిశీలనకు దారి తీసిన పరిస్థితిలేమిటో ఇంకా ఓ అంచనాకు రాలేకపోతున్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో కీలకమైనపెద్దల ప్రమేయం ఉందని అందరూ ఆరోపిస్తున్న సమయంలో సీబీఐ సంచలనం సృష్టించే దిశగా అడుగులు వేస్తున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.