ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ, జనసేనల్లో ఎవరు బలవంతులు ? నిర్మోహమాటంగా జనసేన పేరు చెప్పవచ్చు. ఆ పార్టీకి ప్రజాకర్షణ ఉన్న నాయకుడు ఉన్నారు. బీజేపీకి ఎవరూ లేరు. ఆ పార్టీకి పై స్థాయిలో ఉన్న నాయకుడు ఏపీకి వచ్చినా కాస్త జనం రావాలంటే పవన్ కల్యాణ్ రావాలి. లేకపోతే చిన్న టెంట్ వేసి అందులోనే కుర్చీలేసి… సభా వేదిక నిండింది అనిపించుకోవాలి. అయితే అలాంటి పరిస్థితి ఉన్నా… మిత్రపక్షం అయిన జనసేనను పదే పదే అవమానిస్తున్నారు బీజేపీ నేతలు.
మిత్రపక్షాన్ని ఇలా అవమానించడం న్యాయమా ?
తనకు రాష్ట్ర బీజేపీ నేతలతో పెద్దగా పరిచయం లేదని.. తనకు ఢిల్లీ పెద్దలే పరిచయస్తులు అని పవన్ కల్యాణ్ చెప్పారు. అయితే ఆ ఢిల్లీ పెద్దలు వచ్చినా ఆయనను పట్టించుకోవడం లేదు. జేపీ నడ్డా ఏపీకి వచ్చి జనసేన పేరు కూడా ప్రస్తావించలేదు. పొత్తులో ఉన్న పార్టీకి కనీస గౌరవ మర్యాదలు ఇవ్వలేదు. బీజేపీ రావాలి.. వైఎస్ఆర్సీపీ పోవాలి అని నినాదం ఇచ్చారు కానీ.. బీజేపీ – జనసేన రావాలని ఆయన పిలుపునివ్వలేదు. ఇది బలమైన మిత్రపక్షాన్ని అవమానించడమేనన్న చర్చ జరుగుతోంది.
పొత్తు పేరుతో జనసేననను నిర్వీర్యం చేసేశామని డిసైడయ్యారా ?
అసలు బీజేపీతో జనసేన పొత్తులో ఉందా లేదా అన్నట్లుగా బీజేపీ నేతలందరూ మాట్లాడుతున్నారు. పొత్తు పెట్టుకున్న మొదట్లో పవన్ కల్యాణ్ ఉద్దృతంగా కార్యక్రమాలు నిర్వహించేవారు. అమరావతి ఉద్యమంలో లీడ్ తీసుకున్నారు. అయితే హఠాత్తుగా బీజేపీతో పొత్తు ప్రకటించారు. దీంతో రెండు పార్టీలు ఏం చేసినా కలిసి పనిచేస్తాయన్నట్లుగా మొదట్లో మాట్లాడుకున్నారు. కలిసి పని చేయాలన్న రూల్ కారణంగా జనసేన ప్రజల్లోకి వెళ్లలేకపోయింది. తీరా అసలు సమరం దగ్గరకు వచ్చే సరికి పవన్‌ను బీజేపీ డంప్ చేస్తోంది. కనీసం జనసేన పును కూడా ఆ పార్టీ అగ్రనేతలు ప్రస్తావించడానికి సిద్ధపడటం లేదు.
పవన్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించమన్నారనే కోపమా ?
పవన్ కల్యాణ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని జనసేన నేతలు ఇటీవల డిమాండ్ చేస్తున్నారు. నిజానికి గతంలోనే బీజేపీ పవన్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. తిరుపతి ఉపఎన్నికల సమయంలోనే హైకమాండ్ సూచనలతోనే సోము వీర్రాజు ఈ ప్రకటన చేశారు. ఇప్పుడు అలా ప్రకటించే అవకాశం లేదని చెబుతున్నారు. నిజానికి ఎలా చూసినా.. రెండు పార్టీల్లో సీఎం అభ్యర్థిగా ఒకటి నుంచి పది స్థానాల్లో పవనే ఉంటారు. అలాంటప్పుడు ప్రకటించాడనికి ఇబ్బందేమిటి?
వైసీపీ సహకారమే ముఖ్యమనుకుంటున్నారా ?
బీజేపీ అధికారికంగా జనసేనతో పొత్తులో ఉండవచ్చు కానీ.. అనధికారికంగా వైసీపీతో రాజకీయం చేస్తోంది. ఆ పార్టీకి ఎక్కడా లేనంత సహకారం అందిస్తోంది. ఈ క్రమంలోజనసేన కన్నా వైసీపీ సహకారమే బెటరని బీజేపీ డిసైడయినట్లుగా కనిపిస్తోందంటున్నారు. తిరుపతి ఉపఎన్నిక , స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రెండు పార్టీల మధ్య సంబంధాలు పూర్తిగా చెడిపోయారు. బద్వేలు ఉపఎన్నిక.. ఇప్పుడు ఆత్మకూరు ఉపఎన్నికతో వారి మధ్య దూరం మరింత పెరిగినట్లుగా కనిపిస్తోంది. చివరికి అధికారికంగా పొత్తులున్నాయి.. అనధికిరంగా ఎవరి దారి వారిదే అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఫైనల్‌గా ఇద్దరి మధ్య పొత్తు వికటించిందన్న నిర్ణయానికి రెండు పార్టీల క్యాడర్ వచ్చేసింది.