2014 ఎన్నికల తర్వాత ప్రశాంత్ కిషోర్ ను స్ట్రాటజిస్ట్‌గా పెట్టుకుని కుల రాజకీయం చేసిన వైసీపీ ఫలితాల్ని సాధించింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. పీకే ఇప్పుడు ఆయన సొంత రాజకీయం బీహార్ లో చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆయన నేరుగా వచ్చి ఇతర పార్టీలకు సేవలు అందించే పరిస్థితుల్లో లేరు. కానీ ఐ ప్యాక్ మాత్రం కొనసాగుతోంది. ఈ క్రమంలో రుషిరాజ్ అనే మరో స్ట్రాటజిస్ట్‌ను వైసీపీ కోసం పంపించారు. ఈ రుషిరాజ్ ఐ ప్యాక్ లో కీలక మెంబర్. ఇప్పుడు జగన్ ప్రభుత్వాన్ని మళ్లీ అధికారంలోకి తెప్పించే బాధ్యతను ఆయనే తీసుకుంటున్నారు.
ఎమ్మెల్యేలు, ఇంచార్జులను సీఎం క్యాంపాఫీసులో వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు. ఈ వర్క్ షాప్‌ను నిర్వహించేది రుషిరాజే. వారి నుంచి నియోజకవర్గాలకు సంబంధించిన సమాచారం తీసుకుని.. వ్యూహాలు ఖరారు చేయడానికి వర్క్ షాప్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ రుషిరాజ్ చెప్పినట్లుగా చేయాల్సిందేనని పార్టీ నేతలకు జగన్ తేల్చి చెప్పే అవకాశం ఉంది. ఆయన టీం ఎప్పటికప్పుడు సర్వేలు చేస్తూ.. అభ్యర్థుల విషయంలో సూచనలు చేయనుంది. ఈ సారి కూడా కులాల టార్గెట్‌గానే రాజకీయాలు ఉండనున్నాయి.
అయితే.. బీసీ కులాలకు ప్రాధాన్యం పేరుతో రాజకీయాలు చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ మేరకు ఇతర పార్టీలపై ఫేక్ పోస్టులతో దాడి చేయడం.. ఆ పార్టీపై సామాజికవర్గాల నిందలతో పాటు వైసీపీలో .. కొత్తగా ఎలాంటి మార్పులు వస్తాయో చెప్పడానికి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. అయితే గతంలో పీకే చెప్పినట్లుగా చేసినా కొంత మందికి అవకాశం లభించలేదు. ఈ సారి రుషిరాజ్ ఏం చేస్తారోనన్న ఆందోళన వైసీపీలో వినిపిస్తోంది. పార్టీలో టిక్కెట్లు ఇప్పించింది గతంలో ప్రశాంత్ కిషోర్ అయితే.. ఇప్పుడు రుషిరాజ్ అనే చర్చ నడుస్తోంది.