రాష్ట్ర ప్రజల సమస్యలను తెలుసుకుని, వారి సమస్యలకు సత్వర పరిష్కారం అందించాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నిర్ణయించుకున్నారు. రాష్ట్ర ప్రజల కోరిక మేరకు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని రూపొందించారు. మొదటగా మహిళా దర్బార్ ను ప్రారంభిస్తున్నారు. ఈ నెల 10న రాజ్ భవన్ లో మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. మొదటి ప్రజాదర్భార్ పూర్తిగా మహిళల కోసం కేటాయించారు. హిళల నుంచి సమస్యలు, విజ్ఞప్తులు స్వీకరించి వారి సమస్యలను పరిష్కరించనున్నారు. ఈ మేరకు గవర్నర్ ఇచ్చిన ఆదేశాలతో రాజ్‌భవన్ సచివాలయం ప్రజాదర్బార్ కార్యక్రమ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది.
గతంలో ఎన్నడూ గవర్నర్లు ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుంచి విజ్ఞప్తులు తీసుకున్న సందర్భాలు లేవని , ఈ కార్యక్రమం నిర్వహిస్తే ప్రజల్లో చెడు సంకేతాలు వెళ్తాయని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత స్థాయి అధికారవర్గాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ అంశంపై ఇప్పటికే ప్రభుత్వంకూడా అసంతృప్తిగా ఉంది. అందుకే ఇటీవలి కాలంలో గవర్నర్‌తో ముఖ్యమంత్రి ఎడ మొహం – పెడ మొహంగా ఉంటున్నారని చెబుతున్నారు.
సీఎం వ్యతిరేకత ఎలా ఉన్నా.. తాను ప్రజాదర్భార్ నిర్వహించి తీరాలని గవర్నర్ పట్టుదలగా ఉండటంతో ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం సహకరిచకపోతే సమస్యలు పరిష్కారం కావని.. యంత్రాంగం అంతా ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుందని కొంత మంది గుర్తు చేస్తున్నారు. ఒక వేళ ప్రభుత్వం సహకరించకపోతే ఏం జరుగుతుందన్నది చూడాల్సి ఉంది.