ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం ఉదయం ఆయన అమలాపురం వెళ్తూండగా… అక్కడ 144 సెక్షన్ ఉందని వెళ్లడానికి లేదని పోలీసులు మార్గ మధ్యలోనే అడ్డుకున్నారు. ఆయన కారు వెళ్లకుండా ఖాళీ కంటెయినర్‌ను అడ్డం పెట్టారు. దీంతో సోము వీర్రాజుకు కోపం వచ్చింది. కారు దిగి వచ్చి ఎస్ఐను తోసేశారు. కంటెియన్ డ్రైవర్ దగ్గరకు వెళ్లి దురుసుగా ప్రవర్తించారు. తర్వాత ఆయన అమలాపురం వెళ్లడం లేదని.. రావుల పాలెం వెళ్తున్నానని చెప్పడంతో.. ఆయన కారుకు మాత్రం అనుమతి ఇచ్చి పంపేశారు.
అయితే సోము వీర్రాజు పోలీసులపై దాడి చేస్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. దీంతో పోలీసులపై విమర్శలు వచ్చాయి. సోము వీర్రాజుపై ఎందుకు కేసులు పెట్టలేదన్న విమర్శలు వచ్చాయి. దీంతో సాయంత్రానికి రెండు సెక్షన్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే ఏపీ పోలీసులు ఆయనను అర్థరాత్రి అరెస్ట్ చేస్తారా అన్న సందేహాలు చాలా మందిలో వస్తున్నాయి. ఎందుకంటే అధికార పార్టీ రాజకీయ ప్రత్యర్థులను అరెస్ట్ చేయాలంటే ఏపీ పోలీసులు చేసే వ్యూహం అలాగే ఉంటుంది.
ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు ఎయిర్ పోర్టుకో.. మరో చోటకో వెళ్లి అరెస్ట్ చేశారు. లేదా తెల్లవారుజామునే గోడలు దూకి అరెస్ట్ చేస్తారు. అనేక మంది టీడీపీ నేతల్ని అలాగే అరెస్ట్ చేశారు. మరి సోము వీర్రాజును ఎలా అరెస్ట్ చేస్తారో తెలియాల్సి ఉంది. అయితే ఆయనను అరెస్ట్ చేసినా చేయకపోయినా ఒకటేనని.. కేసు నమోదు చేసి పట్టించుకోరన్న వాదన వినిపిస్తోంది.